Govt Job : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత దారుణం? అసలు బండారం బయటపెట్టిన ప్రియురాలు!
తిరుపతి జిల్లాలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఉద్యోగ అక్రమ ఉదంతం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కన్నతల్లి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఆమెకు ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయని నకిలీ పత్రాలు సృష్టించి, వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఉద్యోగం
- Author : Sudheer
Date : 19-04-2026 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతి జిల్లాలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఉద్యోగ అక్రమ ఉదంతం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కన్నతల్లి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఆమెకు ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయని నకిలీ పత్రాలు సృష్టించి, వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఉద్యోగం సంపాదించిన ఒక ప్రబుద్ధుడి బండారాన్ని అతని ప్రియురాలే ఆధారాలతో సహా బయటపెట్టింది.
ఫేక్ సర్టిఫికేట్లతో కొలువు
చంద్రగిరి నియోజకవర్గం తనపల్లికి చెందిన చక్రపాణి, తన తల్లి జయమ్మ ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్న సబ్ ఆర్డినేట్ ఉద్యోగాన్ని ‘మెడికల్ ఇన్వాలిడేషన్’ కోటాలో దక్కించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం ఆమెకు సర్వైకల్ క్యాన్సర్, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల పేరుతో ఫోర్జరీ ఓపి రికార్డులు సృష్టించాడు. చివరకు కర్నూలు మెడికల్ బోర్డు పరీక్షల సమయంలో తన తల్లికి బదులుగా మరో మహిళను పంపి, అనారోగ్య ధ్రువీకరణ పొందడం గమనార్హం. ఈ అక్రమ మార్గంలో అతను వాల్మీకిపురం ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందడమే కాకుండా, ప్రస్తుతం తిరుచానూరు ఆలయంలో ప్రోటోకాల్ విధుల్లో కొనసాగుతున్నాడు.
ప్రియురాలితో విభేదాలు.. బట్టబయలైన బండారం
అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో, చక్రపాణికి అతని ప్రియురాలితో వచ్చిన విభేదాలు ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. అతను చేసిన ప్రతి అక్రమానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించిన ఆమె, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. రెవెన్యూ, పోలీస్, మెడికల్ విభాగాల్లోని కొందరు అధికారుల సహకారంతోనే ఈ భారీ మోసం జరిగిందని ఆమె ఆరోపిస్తోంది. కన్నతల్లికి క్యాన్సర్ అని అబద్ధం చెప్పి, వ్యవస్థలోని లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.