Train Accident : విజయనగరం రైలు ప్రమాదం ఎలా జరిగింది ? రాంగ్ సిగ్నలే కారణమా ?
Train Accident : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం ఏమిటి ? అనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
- Author : Pasha
Date : 30-10-2023 - 9:41 IST
Published By : Hashtagu Telugu Desk
Train Accident : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం ఏమిటి ? అనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలమండ- కంటకాపల్లి స్టేషన్ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే రైల్వే ట్రాక్‌పై వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన రైలు మార్గంలో 3 లైన్లు ఉన్నాయి. వీటిలోని మధ్యలైన్‌లో పలాస పాసింజర్ ట్రైన్‌ను నిలిపారు. అయితే అదే లైన్‌లో వెనుక నుంచి వచ్చిన రాయగడ పాసింజర్.. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న పలాస పాసింజర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో పలాస పాసింజర్ బోగీలు ఎగిరి.. పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్‌పై పడ్డాయి. పలాస పాసింజర్ బోగీలు వేగంగా వచ్చి తాకడంతో.. గూడ్స్‌కు చెందిన కొన్ని బోగీలు కూడా కిందపడ్డాయి. మొత్తం ఏడు రైలు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి.
ఇంతకీ ఒకే ట్రాక్‌లో..
ఇంతకీ ఒక ట్రాక్‌లో ట్రైన్ నిలబడి ఉండగా .. వెనుక నుంచి మరో ట్రైన్ ఎలా వచ్చింది ? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పలాస పాసింజర్‌ను ఆ రైల్వే ట్రాక్‌లో ఆపింది ఎవరు ? అదే ట్రాక్‌లో వెనుక నుంచి రాయగడ పాసింజర్‌కు సిగ్నల్ ఇచ్చింది ఎవరు ? అనేది తేలాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తుంటే ఇందులో మానవ తప్పిదమే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మానవ తప్పిదం కారణంగా.. సిగ్నలింగ్ వ్యవస్థలో పొరపాటు జరిగి ఇంత బీభత్సానికి దారితీసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆటో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం జరిగి ఉండొచ్చనే మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. పలాస పాసింజర్ రైలును ఎందుకు మధ్య లైన్‌లో నిలిపారు? సాంకేతిక కారణాలతో నిలిపారా ? ముందు స్టేషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా ? అనేది కూడా తేలాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
గత జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో కూడా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్‌లో సిగ్నలింగ్ లోపం కారణంగా.. కోల్‌కతా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 293 మంది చనిపోయారు. ఆ ప్రమాదానికి సంబంధించి సీబీఐ అధికారులు ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరుణ్ కుమార్ మహంత, మహమ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.