Home Minister Vanitha : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ హోంమంత్రి
రాజమహేంద్రవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.
- Author : Prasad
Date : 14-07-2022 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
రాజమహేంద్రవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. మద్దూరులంక, ములకల్లంక గ్రామాల్లో వరద బాధితులను హోంమంత్రి వనిత, జిల్లా కలెక్టర్ మాధవి లత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పరామర్శించారు.
సీతానగరం మండలం బొబ్బిలి లంక నుంచి ములకల్లంక గ్రామానికి పడవపై వెళ్లారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధికారుల సూచనలను పాటించి పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి కోరారు. అంతకుముందు కొవ్వూరు మండలం మద్దూరులంక ముంపు ప్రాంతాన్ని సందర్శించారు. పునరావాస కేంద్రానికి తరలిస్తున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి 2000 రూపాయల పరిహారం ప్రకటించారని ఆమె వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మాధవి లత ఆదేశాల మేరకు గురువారం ఉదయం కడియం మండలం బుర్రిలంక గ్రామంలో చిక్కుకున్న గొర్రెల కాపరులు, 60 గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కృష్ణారావు తెలిపారు.