Fire Accident : సచివాలయంలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో తెలిపిన హోంమంత్రి
Fire Accident : బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత సహా ఇతర కీలక మంత్రులు కార్యాలయాలు ఉండటం వల్ల ఈ ఘటనపై భారీ చర్చ మొదలైంది.
- By Sudheer Published Date - 01:48 PM, Fri - 4 April 25

శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం(AP Secretariat)లోని బ్లాక్ 2లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత సహా ఇతర కీలక మంత్రులు కార్యాలయాలు ఉండటం వల్ల ఈ ఘటనపై భారీ చర్చ మొదలైంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత స్పందించారు. హోంమంత్రి అనిత స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలను సేకరించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 6:30 సమయంలో రెండో బ్లాక్‌లో ఉన్న బ్యాటరీ గదిలో మంటలు చెలరేగాయని తెలిపారు. మొదట ఎస్పీఎఫ్ సిబ్బంది మంటలను అదుపు చేయాలని ప్రయత్నించారని, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. మొత్తం 8 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఘటనలో ఏసీలు, బ్యాటరీలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, పలు గదుల్లో పొగలు వ్యాపించాయని చెప్పారు. అయితే అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.
ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించినట్టు హోంమంత్రి తెలిపారు. ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్‌గా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. పూర్తి స్పష్టత కోసం ఫోరెన్సిక్ సిబ్బందిని కూడా రప్పించామని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక, పోలీసుల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సచివాలయానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.