Cyclone Mandaus: ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ (Mandous) తీవ్ర తుపానుగా మారింది.
- Author : Maheswara Rao Nadella
Date : 09-12-2022 - 1:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ (Mandous) తీవ్ర తుపాను (Cyclone)గా మారింది. ఇది తీరం దిశగా వేగంగా దూసుకొస్తోంది. ఈ అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున మాండౌస్ తుపాను ఉత్తర తమిళనాడు (Tamil Nadu), దక్షిణ కోస్తాంధ్ర(Andhra Pradesh) మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ (IMD) అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడులోని చెన్నై (Chennai) సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష (Heavy Rains) హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం ఈ తుపాను (Cyclone) కరైకాల్‌కు, చెన్నైకి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ట్విటర్‌లో వెల్లడించింది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా కొనసాగుతున్న మాండౌస్.. రానున్న కొన్ని గంటల్లో బలహీనపడి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున మామల్లాపురం సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. నిన్న రాత్రి నుంచే చెన్నైలో మోస్తారు వర్షం కురుస్తోంది.
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు:
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మాండౌస్ కొనసాగుతోన్న నేపథ్యంలో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తుపాను పట్ల ఇప్పటికే జిల్లాల అధికారులకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ చర్యల కోసం మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు 2, నెల్లూరుకు 3, తిరుపతికి 2, చిత్తూరుకు 2 సహాయ బృందాలను అధికారులు కేటాయించారు.
విద్యా సంస్థలకు సెలవు:
తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం తడకుప్పంలో తీరప్రాంతంలో ఉంటున్న జాలర్ల కుటుంబాలను తరలిస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో రాత్రి నుంచి ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. బి.ఎన్.కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
తమిళనాడులోని 12 జిల్లాలకు అలర్ట్:
వర్ష హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువల్లూర్, చెంగల్‌పట్టు, వేలూరు, రాణిపెటాయ్, కాంచీపురం సహా 12 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు పార్కులు, ప్లేగ్రౌండ్‌లు తెరవకూడదని చెన్నై నగరపాలక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లొద్దని, చెట్ల కింద కారులు నిలిపి ఉంచొద్దని సూచించారు. వరద సహాయ చర్యల నిమిత్తం 10 జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మోహరించారు. అటు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు నేడు, రేపు సెలవు ప్రకటించింది.
Also Read: Janasena : పవన్ పై `వారాహి` తిరుగుబాటు!రంగుపై జగనన్న`సైన్యం` ఫైట్!!