GRMB Meeting: గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాన చర్చ…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగింది.
- Author : Kode Mohan Sai
Date : 07-04-2025 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
GRMB Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయమై సమాచారం మరియు వివరాలు దాచిపెడుతున్నదని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు గడిచాయని, కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు యొక్క పూర్తి వివరాలు, అలాగే దాని వల్ల తెలంగాణకు వచ్చే ప్రభావాలపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు వివరాలు అందించాలని తెలంగాణ అధికారులు కోరారు.
అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారనే ఆరోపణను తెలంగాణ అధికారులు చేయగా, ఈ విషయం పై ఏపీ అధికారులు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) ఇంకా తయారు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు, పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రూ.15 కోట్లతో తక్షణ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో జీఆర్‌ఎంబీ కార్యదర్శి అజగేషన్ వ్యవహారశైలిపై తెలంగాణ అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు పేర్కొన్నట్లుగా, బోర్డు సమావేశాలు రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్వహించబడుతున్నాయి. అంతేకాకుండా, జీఆర్‌ఎంబీ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఏపీ, తెలంగాణ అధికారులపై అజగేషన్ వేధింపులు చేస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తదితర ప్రముఖ అధికారులు పాల్గొన్నారు.