AP Pensioners: అవ్వా తాతలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల పెన్షన్ ఒక రోజు ముందే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెల పింఛన్ పంపిణీకి చిన్న మార్పు చేసింది. డిసెంబర్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో, పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ చేయనున్నారు.
- By Kode Mohan Sai Published Date - 12:54 PM, Mon - 25 November 24

AP Pensioners: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల పింఛన్‌ను ఒకరోజు ముందుగానే, నవంబర్ 30వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది. సాధారణంగా, ప్రభుత్వ పంపిణీ ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతుంది. అయితే, ఈ నెల ఒకటో తేదీ ఆదివారం రావడంతో, సెలవుదినం అవడంతో పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ తీసుకునే వారు ఈ మార్పును గమనించాల్సిందిగా అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తేదీ సెలవు ఉన్న నెలలో, ముందు నెల చివరి రోజున ఇచ్చి పెన్షన్ దారులు మిగిలితే ప్రస్తుత నేల రెండవ తేదీన మిగతా పెండింగ్ ఉన్న పింఛన్లను పంపిణీ చేయాలని సూచించింది. అలా కాకుండా రెండవ తేదీ కూడా సెలవు అయితే, మూడవ తేదీ న పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాధారణంగా, 1న సెలవు దినం రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతుండటంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అదే విధంగా, పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే, మూడో నెలలో మూడు నెలల పింఛన్లు ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధన ఈ నెల నుంచే అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు.
పింఛన్ కు సంబంధించి కొత్త నిబంధనలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే, వారిని వలసదారులుగా గుర్తించి, పింఛన్ రద్దు చేయనుంది. అయితే, వారు మళ్లీ పింఛన్ కోసం దరఖాస్తు చేస్తే, పింఛన్ మళ్లీ మంజూరు చేయబడుతుంది.
ఇదే కాకుండా, పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే, ఆ మరుసటి నెల నుండి భార్యకు పింఛన్ ఇవ్వడం ప్రారంభించనున్నారు. పింఛన్ తీసుకునే వ్యక్తి ఆ నెల 15వ తేదీ లోపు మరణిస్తే, వితంతు మహిళకు తదుపరి నెల 1వ తేదీనే పింఛన్ మంజూరు చేస్తారు.
ఈ పింఛన్ మంజూరికోసం, అర్హులు ఆధార్ కార్డు, భర్త మరణ ధ్రువపత్రం, కుల ఆదాయ పత్రాలు అందజేయాలని అధికారులు చెప్పారు. ఈ మేరకు, పింఛన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ రాయితీ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి, విద్యా సంస్థల్లో, గురుకులాల్లో, లేదా హాస్టల్స్‌లో నివసిస్తూ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా తమ సొంత ఊరికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి ఉండేది. ఇందుకు విద్యార్థులు సెలవు తీసుకోవాలి మరియు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి ఉండేది.
ఈ సమస్యను గమనించిన ఏపీ ప్రభుత్వం ఇంకో మెరుగైన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి, దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్‌లోనే పింఛన్ డబ్బులు జమ చేయబడతాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రయాణ ఖర్చులు, సెలవుల ఇబ్బందుల నుండి ముక్తి పొందగలుగుతారు.