NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు శుభవార్త… కొత్త పెన్షన్ దరఖాస్తుల ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభలో తాజా చర్చల అనంతరం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు.
- By Kode Mohan Sai Published Date - 12:56 PM, Fri - 15 November 24

NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అర్హత కలిగిన పెన్షన్ దారుల నుంచి డిసెంబర్ 1వ వారం నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కొత్తగా పెన్షన్లకు అర్హత సాధించిన వారు తమ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం, సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక పెన్షన్లు అందించే సమయంలో, ఒకటి లేదా రెండు నెలలు గ్రామంలో లేని పెన్షన్ దారులకు, తదుపరి నెలలో పెన్షన్ మొత్తం జమ చేయాలని సూచించారు. మరోవైపు, వరుసగా మూడు నెలలపాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే, ఆ వ్యక్తులను శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా ఆపివేసే నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన చర్యలు తీసుకుని, ఆ వ్యక్తులు తిరిగి దరఖాస్తు చేసుకున్న వెంటనే పెన్షన్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అనారోగ్య కారణాలతో మంచంపై లేదా వీల్ చైర్‌పై పరిమితమై ఉన్నవారు, వికలాంగుల పెన్షన్లలో అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లు వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, వాటి పునఃసమీక్షణ చేసి, సంబంధిత శాఖల అధికారులతో విచారణ జరపాలని, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్లు రద్దు:
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో పనిచేసే కుటుంబాలకు పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. అయితే, 25 వేల రూపాయలు వరకు జీతాలు పొందే ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్లు పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా, లక్షలాదిగా పెన్షన్లు తొలగించారు. రేషన్ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులందరిని ఒకే యూనిట్‌గా పరిగణించడంతో ఈ సమస్య ఏర్పడింది.
ఈ విధంగా, గ్రామాల్లో నివసిస్తున్న వృద్ధులు, కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అయిన కుటుంబాలవారికి కూడా పెన్షన్లు రద్దయ్యాయి. పట్టణాల్లో, నామమాత్రపు జీతాలతో పని చేసే వారు, తమ కుటుంబాలకు పెన్షన్ భరోసా కోల్పోయినట్లు పెద్ద సంఖ్యలో రిపోర్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు:
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3 లక్షల మంది అనర్హులు సామాజిక పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయం గురువారం అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన ప్రకటన ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా 2.5 లక్షల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
మంత్రిగా ఆయన సమాధానమిచ్చిన అనంతరం, స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేసే ప్రక్రియపై అడిగి, వికలాంగుల పెన్షన్లలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నారో లేదో ప్రశ్నించారు. ఈ అంశంపై మంత్రి వివరించి, “కొత్త ప్రభుత్వం అర్హతను పరిశీలించి, 3 లక్షల మంది పెన్షన్లు అనర్హులుగా గుర్తించబడినాయి. అలాగే, 2.5 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని”, అన్నారు.
అనర్హుల పెన్షన్లు చెల్లించడం, అలాగే వికలాంగుల పెన్షన్ల విషయంలో అర్హత లేని వారికి ధృవీకరణ ఇచ్చినట్లుగా తేలిందని, వాటి సవరణ కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మరియు, రాష్ట్రంలో 8లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయని వాటన్నింటిని వెరిఫై చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖలతో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, పెన్షనర్లలో భార్య లేదా భర్త మరణించిన పక్షంలో స్పౌస్ పెన్షన్ జారీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి శ్రీనివాస్ వివరించారు.