ఏపీ మాజీ సీఎం కన్నుమూత
టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- Author : Gopi
Date : 22-04-2026 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
Nadendla Bhaskara Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) బుధవారం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
లాయర్ నుంచి సీఎంగా
గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు వృత్తిరీత్యా న్యాయవాది. 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ ప్రక్రియలో నాదెండ్ల కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
Also Read: దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్
రాజకీయ ప్రకంపనలు.. ఆ 31 రోజుల పాలన
నాదెండ్ల భాస్కరరావు పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో 1984 నాటి రాజకీయ సంక్షోభం గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే కేవలం 31 రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో కొనసాగగలిగారు. ఎన్టీఆర్ తిరిగి వచ్చి తన బలాన్ని నిరూపించుకోవడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది.
తర్వాతి ప్రయాణం
టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య వంటి హేమాహేమీల కాలంలో కీలక నేతగా వ్యవహరించిన నాదెండ్ల, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో కీలక నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారు. భాస్కరరావు మృతితో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది. ఆయన మృతికి గౌరవసూచకంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.