First Bird Flu Death In AP: ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం..
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కారణంగా మృతిచెందిన చిన్నారి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం వెలుగు చూసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ రంగంలోకి దిగింది.
- By Kode Mohan Sai Published Date - 02:53 PM, Fri - 4 April 25

First Bird Flu Death In AP: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కారణంగా మృతిచెందిన చిన్నారి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం వెలుగు చూసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ రంగంలోకి దిగింది. నరసరావుపేటకు చెందిన రెండు సంవత్సరాల చిన్నారి బర్డ్‌ఫ్లూ వల్ల మరణించడంతో, కేంద్రం ఈ ఘటనపై తీవ్ర దృష్టి పెట్టింది.
సమాచారం అందుకున్న వెంటనే, కేంద్ర వైద్య బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి, సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనితో, ఢిల్లీ ఎన్‌సీబీకి చెందిన ముగ్గురు సభ్యులు, ముంబైకి చెందిన ఒక డాక్టర్, అలాగే మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్‌లతో కూడిన ఒక ప్రత్యేక బృందం, ఈ ఘటనపై పరిశీలన ప్రారంభించింది.
మొదటగా, ఎయిమ్స్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై, చిన్నారి ఆరోగ్య పరిస్థితి, ఆమె జబ్బు పడ్డ సమయం, ఆస్పత్రిలో చేరిన సమయంలో జరిగిన చికిత్స, వైద్యం తదితర అంశాలపై చర్చలు జరిపారు. తరువాత, నరసరావుపేటలో చిన్నారి కుటుంబసభ్యులతో మాట్లాడి, వారు కొనుగోలు చేసిన చికెన్ షాపు నుంచి శాంపిల్స్ సేకరించారు. అంతేకాదు, కలెక్టరేట్‌లోని అధికారులతో సమావేశమై, అన్ని వివరణాత్మక సమాచారాన్ని సమీకరించారు.
మరోవైపు, నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో బాధితమైన రెండేళ్ల చిన్నారి మరణం తరువాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, చిన్నారి కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితి పై సర్వేలు కొనసాగిస్తున్నామని, ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు తెలిపారు.
అంతే కాకుండా, ఆ ప్రాంతంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదుకాలేదని, ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ప్రత్యేక అలర్ట్ కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని నిర్ణయించామని కూడా వివరించారు.