Chandrababu Road Show : చంద్రబాబు రోడ్ షో సూపర్ హిట్ ! ఏలూరులో జనప్రభంజనం!!
ఉభయ గోదావరి జిల్లా ప్రజల నాడి రాజ్యాధికారాన్ని నిర్ణయిస్తుందని రాజకీయ నానుడి.
- Author : CS Rao
Date : 30-11-2022 - 2:06 IST
Published By : Hashtagu Telugu Desk
ఉభయ గోదావరి జిల్లా ప్రజల నాడి రాజ్యాధికారాన్ని నిర్ణయిస్తుందని రాజకీయ నానుడి. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎటు వైపు ఉంటే ఆ పార్టీకి అధికారం ఖాయమని చాలా సందర్భాల్లో ప్రూ అయింది. 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్వీప్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి స్పందన జనం నుంచి ఉందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మూడు రోజుల పర్యటనకు గోదావరి జిల్లాలకు వెళ్లిన చంద్రబాబు తొలి రోజు ఏలూరు జిల్లాలో `ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి` అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తొలి రోజు ఆయన దెందులూరు, చింతలపూడి ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఆయన రాక కోసం బుధవారం ఉదయం నుంచి ప్రజలు ఎదురుచూడడం కనిపించింది. ఆయన కాన్వాయ్ వెంట పరుగులు పెడుతూ మళ్లీ చంద్రన్న రావాలి అంటూ నినదించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఎమ్మెల్యే రామారావు, మాజీ ఎంపీ మాగంటి బాబు తదితర లీడర్లతో కూడి చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన జనం టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. రెండో రోజు పోలవరం, కోవూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు. మూడో రోజు నిడదవోలు, తాడేపల్లి గూడెం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.
50 రోజులు 50 లక్షల కుటుంబాలే టార్గెట్‌గా `ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి` కార్యక్రమాన్ని టీడీపీ డిజైన్ చేసింది. తొలి ఏలూరు జిల్లా విజయరాయిలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అక్కడ నుంచి బయల్దేరి వలసపల్లి క్రాస్ రోడ్ మీదుగా చింతలపూడి వెళతారు. మార్గమధ్యంలో ఉండే గ్రామాల ప్రజలను ఉద్దేశించి రోడ్ షోల్లో బాబు మాట్లాడేలా షెడ్యూల్ చేశారు. చింతలపూడిలో సాయంత్రం 7గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో ఆయన రాత్రి బస చేస్తారు.
గురువారం పోలవరం వెళతారు. అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొవ్వూరులో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గురువారం రాత్రి అక్కడే బసచేస్తారు. శుక్రవారం నిడదవోలులో జరిగే రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు నిడదవోలు నుంచి తాడేపల్లి గూడెం మండలం నవాబుపాలెంలో రైతులతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి తాడేపల్లిగూడెం వచ్చి అక్కడ నిర్వహించే రోడ్‌షో అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి `ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి..` కార్యక్రమాన్ని టీడీపీ తలపెట్టింది. చంద్రబాబు మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపారు. కర్నూలు తరహా స్పందన జనం నుంచి గోదావరి జిల్లాల్లోనూ కనిపిస్తోందని టీడీపీ అంచనా వేస్తోంది. ఫలితంగా రాబోవు రోజుల్లో అధికారంలోకి రావడం తథ్యమని ప్రగాఢంగా విశ్వసిస్తోంది.