Mega DSC : DSC అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా
DSC : కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు కానీ వాయిదాకు కారణాలు మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.
- By Sudheer Published Date - 12:15 PM, Thu - 18 September 25

ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న DSC అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ (Distribution of DSC appointment letters) కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. అమరావతిలో రేపు నిర్వహించాల్సిన ఈ నియామకపత్రాల పంపిణీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు కానీ వాయిదాకు కారణాలు మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.
Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదు
అమరావతికి రానున్న అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమం వాయిదా పడడంతో ఆ బస్సులను కూడా రద్దు చేశారు. ఇప్పటికే అమరావతికి చేరుకోవడానికి సిద్ధమైన అభ్యర్థులు ఈ పరిణామంతో గందరగోళానికి గురయ్యారు. ప్రభుత్వ నియామకాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న యువతకు మరోసారి నిరుత్సాహం తప్పలేదు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలే ఈ కార్యక్రమం వాయిదా పడటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. భద్రతా సమస్యలు, రవాణా అంతరాయాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటనలో దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని DSC అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.