TTD : గత పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసింది..: పవన్ కల్యాణ్
Pawan Kalyan: గత పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని..అనేక ప్రాంతాల్లోని టీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టిన గత పాలకులు..దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనుమానం వ్యక్తం చేశారు.
- By Latha Suma Published Date - 05:07 PM, Mon - 23 September 24

Deputy CM Pawan Kalyan Statement on TTD: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని..అనేక ప్రాంతాల్లోని టీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టిన గత పాలకులు..దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విచారణ, దేవాదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల విషయంలోనూ సమీక్ష అవసరమన్నారు.
శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే..
తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పవన్ కల్యాణ్ అన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారు. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండిలో వేసే భక్తులూ ఉన్నారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయి.
పప్పుబెల్లాల్లా అమ్మేయడానికి ఎందుకు ఉత్సాహపడింది?..
భక్తులు ఏ ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్దకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చింది. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికి ఎందుకు ఉత్సాహపడింది? వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తాం. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్ళకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుంది. ఈ క్రమంలో గత పాలక మండళ్ళు టీటిడి ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్‌గాంధీ