Pawan Kalyan : RWS ల్యాబ్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
Pawan Kalyan : ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.
- By Latha Suma Published Date - 05:15 PM, Sun - 6 October 24

AP RWS Employees meets Pawan Kalyan: తమకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని సంబంధిత శాఖల ఉద్యోగులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమకు జీతాలు రావడం లేదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, RWS శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ను కలిసి తమకు 3 నెలలుగా జీతాలు రావడం లేదని, తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వాపోయారు. ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.
తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలాలని ఓ దివ్యాంగురాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో గత 10 ఏళ్లు జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు హెల్పర్ గా పని చేస్తున్నారు. అయితే తనను 3 నెలల కిందట విధులు నుంచి తొలగించారని పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు సైతం చేయకూడదని డిప్యూటీ సీఎం పవన్ కు తెలిపారు. కనుక బతకడానికి ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఈ సందర్భంగా సుజన కుమారి వేడుకున్నారు. వెంటనే స్పందించి ఆయన అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని ఆమెకు భరోసా ఇచ్చారు.