Daggubati Venkateswara Rao : 30 ఏళ్ల తరువాత కలిసిన తోడళ్లుల్లు
Daggubati Venkateswara Rao : సుదీర్ఘ విరామం తర్వాత తొడల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు
- By Sudheer Published Date - 07:29 PM, Tue - 25 February 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao ) సుదీర్ఘ విరామం తర్వాత తొడల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ భేటీ రాజకీయ రంగంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని, తాను రాసిన “ఆది నుంచి నేటి వరకు” అనే ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించేందుకే కలిశానని దగ్గుబాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులను ఆయన ఆహ్వానించారు.
దగ్గుబాటి-చంద్రబాబు మధ్య దూరం ఎలా పెరిగింది?
1995లో టీడీపీ అంతర్గత రాజకీయాల నేపథ్యంలో నందమూరి కుటుంబంలో పెరిగిన విబేధాల కారణంగా దగ్గుబాటి, చంద్రబాబు మధ్య సంబంధాలు దూరమయ్యాయి. ఎన్టీఆర్‌ను గద్దెదించిన పరిణామాల తర్వాత హరికృష్ణ, దగ్గుబాటిలు చంద్రబాబుకు దూరమయ్యారని అప్పట్లో చర్చ సాగింది. తొలుత చంద్రబాబును మద్దతు ఇచ్చినప్పటికీ, తరువాత దగ్గుబాటి టీడీపీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు. ఆయన సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సంబంధాల పరంగా కొన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు, పురందేశ్వరి కలిసి కనిపించినా, వెంకటేశ్వరరావు మాత్రం చంద్రబాబు నివాసానికి దాదాపు 30 ఏళ్లుగా రాలేదు.
రాజకీయ కూటముల ప్రభావం?
ఏపీలో ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడడం.. ఈ కూటమి పొత్తుల నేపథ్యంలో దగ్గుబాటి-చంద్రబాబు మధ్య మళ్లీ అనుబంధం బలపడిందన్న చర్చ జరుగుతుంది. అయితే దగ్గుబాటి ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు తనయుడు దగ్గుబాటి చెంచురామ్‌తో కలిసి వైసీపీలో చేరారు. కానీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదనే ప్రచారం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నివాసంలో దగ్గుబాటి భేటీ కావడం, రాజకీయ భవిష్యత్తుపై ఏదైనా సంకేతమా? అన్న ప్రశ్నలు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి చాల ఏళ్ల తర్వాత తోడళ్లుల్లు కలుసుకోవడం టీడీపీ, నందమూరి శ్రేణుల్లో సంతోషం నింపింది.
AP Fiber Net : ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య