Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!
Universal Health Policy : ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు హెల్త్ పాలసీ అందించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ కింద ఎంపిక చేసిన కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది
- By Sudheer Published Date - 08:15 AM, Fri - 5 September 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ‘ఆయుష్మాన్ భారత్- NTR వైద్య సేవ’ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు హెల్త్ పాలసీ అందించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ కింద ఎంపిక చేసిన కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు మొదలైన వారికి ఇప్పటికే వర్తిస్తున్న EHS (Employee Health Scheme) పరిధిలోకి రాని వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇది ప్రజలకు పెద్ద ఆర్థిక భరోసాను కల్పించనుంది.
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
ఈ పథకం పరిధిలోకి పాత్రికేయుల కుటుంబాలను కూడా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య సేవలు అవసరమైనప్పుడు, మొదట ఆసుపత్రి ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అనంతరం, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆ బీమా కంపెనీలకు తిరిగి చెల్లిస్తుంది. ఈ చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లులను 15 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఆసుపత్రులు, బీమా కంపెనీల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది.
రోగులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోగి ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోగా చికిత్సకు అవసరమైన అప్రూవల్ లభించేలా RFP (Request for Proposal) విధానాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా రోగులు అనవసరమైన ఆలస్యాన్ని ఎదుర్కోకుండా, త్వరితగతిన వైద్యం పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వస్తాయి.