Chittoor Court: నారాయణకు బెయిల్!
10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో నారాయణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
- Author : Balu J
Date : 11-05-2022 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఎస్‌ఎస్‌సీ 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అయితే నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడికి చిత్తూరులోని స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ విధుల నుంచి తప్పుకున్నారని, ప్రస్తుతం కాలేజీలతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవని నారాయణ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌కు తెలిపారు. వాదనలను పరిశీలించిన తర్వాత, చిత్తూరులోని స్థానిక మేజిస్ట్రేట్ ఇద్దరు పూచీకత్తుతో వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిల్ మంజూరు చేశారు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్‌లో ఉన్న నారాయణ నివాసంలో మంగళవారం (మే 10) సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తరలించారు. పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉన్నట్లు తేలిందని.. అందుకే ఆయన్ను అరెస్ట్ చేశామని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చారు. నారాయణను చిత్తూరుకు తరలించి… అక్కడి ప్రభుత్వాసుపత్రిలో పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంలో బెయిల్ లభించడంతో నారాయణకు ఊరట లభించినట్లయింది. కాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ చేసి నారాయణను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మరోసారి తెరపైకి రావడంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.