Mahanadu 2025 : వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Mahanadu 2025 : రాజకీయ పరిణామాల్లో నేరస్తుల కుట్రలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు, సంతనూతలపాడు ఘటనలపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ
- By Sudheer Published Date - 10:46 AM, Thu - 29 May 25

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu )లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (YS Vivekananda Reddy Murder) తనపై మోపిన కుట్ర అని పేర్కొన్నారు. తొలుత గుండెపోటుతో మరణించారని టీవీలు పేర్కొన్నా, చివరకు గొడ్డలితో దాడిచేసిన హత్యగా మారిందని వివరించారు. రక్తపు మచ్చలు గోడల వరకూ కనిపించాయని పేర్కొంటూ, ఇది సాధారణ హత్య కాదని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ హత్య కేసు ద్వారా తాను దోషిగా కనిపించేలా చేసిన కుట్రపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు హెచ్చరికలు చేశారు.
PBKS vs RCB: నేడు పంజాబ్‌తో బెంగళూరు కీలక పోరు.. ఆర్సీబీకి కెప్టెన్సీ ఎవరూ చేస్తారు?
పార్టీలో ప్రతి కార్యకర్తే ముఖ్యమని, హైకమాండ్ అనేది కార్యకర్తే అని చంద్రబాబు స్పష్టం చేశారు. 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేర్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. టీడీపీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు, తొలిసారి 65 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని తెలిపారు. నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఆరు శాసనాలు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేలా ఉన్నాయని ప్రశంసించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అత్యల్ప వయస్సులో కేంద్ర మంత్రి అయ్యారని, ఇది టీడీపీ యువతకు అందుతున్న గుర్తింపు అని పేర్కొన్నారు.
తాజా రాజకీయ పరిణామాల్లో నేరస్తుల కుట్రలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు, సంతనూతలపాడు ఘటనలపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, నేర రాజకీయాలను తాము సహించబోమని హెచ్చరించారు. కొందరు కోవర్టులు పార్టీలోకి వచ్చి నష్టపరుస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వలస పక్షుల కంటే నిజమైన కార్యకర్తే పార్టీకి జీవంగా ఉంటాడని, పార్టీ విజయానికి కార్యకర్తలే కీలకమని చంద్రబాబు అన్నారు.