Vision-2047 : బాబు విజన్ 2047.. “ఇండియా ఇండియన్స్ తెలుగూస్” పేరుతో డాక్యుమెంట్ విడుదల
ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో Vision 2047 డాక్యుమెంట్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
- Author : Prasad
Date : 15-08-2023 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో Vision 2047 డాక్యుమెంట్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పై GFST (Global Forum for Sustainable Transformation) సుదీర్ఘ కసరత్తు చేసింది. GFST చైర్మన్ గా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించే 2047 నాటికి భారత దేశం సూపర్ పవర్ గా అవతరించడానికి అవసరమైన విజన్ డాక్యుమెంట్‌ను చంద్రాబాబు నాయుడు విడుదల చేశారు. ప్రస్తుత సవాళ్లను ప్రజాహితం కోసం ధీటుగా ఎదుర్కొంటూ.. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటంలో చంద్రబాబు పేరుగాంచారు. ఈ దిశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ‘Vision 2020’, నవ్యాంధ్ర కోసం ‘విజన్ 2029’ రూపొందించి.. ఆ మేరకు పటిష్టమైన చర్యలు చేపట్టి సత్ఫలితాలను సాధించిన చంద్రబాబు.. దేశం కోసం నేడు మరో అడుగు వేశారు. ‘ఇండియా, ఇండియన్స్ తెలుగూస్ – విజన్ 2047’ పేరుతో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితికి ఎదగటానికి 5 వ్యూహాల (స్ట్రాటజీస్) తో కూడిన దార్శనిక పత్రాన్ని విశాఖపట్నంలో విడుదల చేశారు.

చంద్రబాబు ఆధ్వర్యంలోని ‘గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్సఫర్మేషన్’ (జీఎఫ్ఎస్ టి) ఈ పత్రాన్ని రూపొందించింది. పలు రంగాల ప్రముఖులు, కార్పొరేట్, పర్యావరణ రంగాల ప్రతినిధులు, మాజీ ఉన్నతాధికారులు ఈ ఫోరంలో సభ్యులుగా ఉన్నారు.. విజన్ 2047లో భాగంగా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ లోని ఐదు స్ట్రాటజీలు.. 1.గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ-ప్రపంచ పౌరులుగా భారతీయులు-బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు , 2.డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ – పి 4 మోడల్ సంక్షేమం, 3.సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత (ఇన్నోవేషన్) – భావి నాయకత్వం, 4.ఎనర్జీ సెక్యూర్ ఇండియా – డెమోక్రైజేషన్, డీకార్బనైజేషన్ మరియు డిజిటలైజేషన్, 5.వాటర్ సెక్యూర్ ఇండియా
అనుభవరీత్యా ప్రణాళికాబద్ధమైన విధానాలతో, నిర్దిష్ట దార్శనికతతో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థోమతను పెంచుకోవాలనే సవాళ్లతో కూడిన లక్ష్యాన్ని పెట్టుకుని భారతదేశం ముందుకు పయనించాలనేది తమ ఉద్దేశమని చంద్రబాబునాయుడు అన్నారు. స్వాతంత్య్ర శత వర్షాల సంబరాలు జరుపుకునే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలని ఆయన సూచించారు. విజన్ డాక్యుమెంట్ లోని ఐదు స్ట్రాటజీలపై ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు Vision 2047ను వివరించారు. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మేథావులు, పలు రంగాల నిపుణులు,విద్యావంతులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు.
Also Read: ‘Vision 2047’ : విశాఖలో చంద్రబాబు పాదయాత్ర..పోటెత్తిన జనం