CBN: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. అధికారులు సమన్వయంతో పని చేయాలి!
- By Balu J Published Date - 11:51 PM, Mon - 10 June 24

CBN: ఈనెల 12వ తేదీన గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలోని ఐటి పార్క్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పటిష్ట సమన్వయంతో వ్యవహరించాలని కార్యక్రమ ప్రత్యేక అధికారి జి.వీర పాండ్యన్ సూచించారు. సోమవారం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కార్యక్రమ ప్రత్యేక అధికారి జి.వీర పాండ్యన్.. కార్యక్రమ సమన్వయ ఉన్నతాధికారులతో కలిసి గ్యాలరీల ఇన్చార్జిలతో చర్చించారు. విధుల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గనిర్దేశనం చేశారు.
మూడు కేటగిరీల్లో మొత్తం 36 గ్యాలరీలు ఉంటాయని.. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రత్యేక అతిథులు, వీవీఐపీలు, వీఐపీలు, మీడియా ప్రతినిధులు తదితరులకు సంబంధించిన గ్యాలరీల విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని.. ప్రణాళిక ప్రకారం అతిధులకు సేవలు అందించాలని సూచించారు. ప్రతి గ్యాలరీకి వాటర్ టీం, శానిటేషన్ టీం, మెడికల్ టీం ఉంటాయని తెలిపారు.
ఈ బృందాల సభ్యులతో గ్యాలరీల ఇన్చార్జులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు గ్యాలరీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారని వివరించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రధానమంత్రి కూడా కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఎస్పీజీ భద్రత ఉంటుందని అందువల్ల భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు ఆయా గ్యాలరీల్లో సరైన విధంగా ఆశీనులు అయ్యే విధంగా చూడాలన్నారు.