AP Assembly : అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు – సీఎం చంద్రబాబు
AP Assembly : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఏటా సుమారు రూ.750 కోట్ల ఆదా జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలకు పన్ను తగ్గడం రైతులకు గొప్ప ఊరట కలిగిస్తుందని కూడా ఆయన వివరించారు
- By Sudheer Published Date - 08:42 PM, Thu - 18 September 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) శాసనసభలో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. గతంలో దేశంలో పన్నుల వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉండి, సీసీటీ, వ్యాట్, వివిధ రకాల సెస్సులు, సర్‌ఛార్జీలతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ తీసుకొచ్చిన “ఒక దేశం–ఒకే పన్ను” విధానం పన్ను వ్యవస్థను సరళతరం చేయడమే కాకుండా ప్రజలకు మేలు చేస్తోందని తెలిపారు. పేదల జీవితాల్లో ఈ సంస్కరణలు మార్పు తీసుకురావడమే కాకుండా అభివృద్ధికి పునాదులు వేస్తాయని సీఎం అన్నారు.
Nag100 : నాగార్జున 100వ మూవీలో ఆ ఇద్దరు..?
జీఎస్టీ సవరణల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై భారం తగ్గుతుందని చంద్రబాబు వివరించారు. సబ్బులు, టూత్‌పేస్టులు, షాంపూలు, నెయ్యి వంటి అవసరమైన వస్తువులు చౌకగా లభిస్తాయని, అలాగే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్‌లు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువులు 5 శాతం శ్లాబులోకి రావడం వల్ల ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందని, సామాన్యుడి సొంతింటి కల నెరవేరే అవకాశం పెరుగుతుందని అన్నారు.
అదేవిధంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని సున్నా శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని సీఎం పేర్కొన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఏటా సుమారు రూ.750 కోట్ల ఆదా జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలకు పన్ను తగ్గడం రైతులకు గొప్ప ఊరట కలిగిస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ సంస్కరణల ఫలితంగా దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగి, వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయని గుర్తుచేశారు. చివరగా, ఈ ప్రయోజనాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని, సమగ్ర అభివృద్ధే తన ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.