Chandrababu Sketch : ఒకే వేదికపై జనసేనాని, జూనియర్ ? బాబు స్కెచ్..!
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు డూ ఆర్ డై ఇష్యూగా కనిపిస్తున్నాయి. అందుకే, చంద్రబాబు సర్వశక్తులను కూడదీసుకుంటున్నారు. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఎన్నికల యుద్ధం చేయాలని భావిస్తున్నారట.
- By CS Rao Published Date - 03:15 PM, Thu - 14 April 22

రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు డూ ఆర్ డై ఇష్యూగా కనిపిస్తున్నాయి. అందుకే, చంద్రబాబు సర్వశక్తులను కూడదీసుకుంటున్నారు. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఎన్నికల యుద్ధం చేయాలని భావిస్తున్నారట. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలోకి దింపాలని ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఇప్పటికే కుటుంబ పరంగా లైజనింగ్ జరుగుతుందని అంతర్గత సమాచారం. ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు నచ్చజెప్పి రంగంలోకి దించాలని స్కెచ్ వేస్తున్నారట. ఒక వేళ ఆసక్తి చూపకపోతే కనీసం వ్యక్తిగత మెసేజ్ లు జూనియర్ ద్వారా అభిమానులకు పంపేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రతి ఓటు, ప్రతి వ్యక్తి ముఖ్యమని చంద్రబాబు ఇప్పటికే టీడీపీ క్యాడర్ కు దిశానిర్దేశం ఇచ్చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను పార్టీకి అనుకూలంగా మలుచుకుంటే టీడీపీకి తిరుగుండదని కొందరి వాదన. ఇటీవల జరిగిన “RRR” సినిమా ఈవెంట్‌లో టీడీపీ కార్యకర్తలు పచ్చ జెండాలను ఎగురవేసి హల్ చల్ చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఆ ఈవెంట్ జూనియర్ సత్తాను చాటింది. టీడీపీ జెండాలను ఆ ఈవెంటలో రెపరెపలాడించడం చూస్తే జూనియర్ పై అభిమానులకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశాలు, బయట సభల్లోనూ జూనియర్ మాట వినిపిస్తోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎదుట ఏ విధంగా జూనియర్ అభిమానులు పట్టుబట్టారో మరచిపోలేం. ఆ ఎన్నికల్లో జూనియర్ ప్రభావం పడిందని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు, పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లోనూ జూనియర్ అండ కోసం సీనియర్లు గళం విప్పిన సందర్భాలు అనేకం.
ముఖ్యమంత్రిగా మాత్రమే రాష్ట్ర అసెంబ్లీకి అడుగుపెడతానని చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసి, బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆ ప్రతిజ్ఞ నెరవేరాలంటే, గెలవడానికి సర్వశక్తులు ఒడ్డాలి. అందులో ప్రధానమైన అస్త్రం జూనియర్ ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ మద్ధతు లేకుండా చంద్రబాబు నేరుగా ఎన్నికలకు వెళ్లలేరు. ఆ కుటుంబం నుంచి బాలక్రిష్ణ ఉన్నప్పటికీ హిందూపురం వరకు ఆయన పరిమితం అవుతున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా టీడీపీ క్యాడర్ ఆయన్ను పెద్దగా గుర్తించడం లేదని సర్వత్రా పార్టీ అంతర్గతంగా వినిపిస్తోంది. 2009 ఎన్నికల సందర్భంగా జూనియర్ చేసిన ప్రచారాన్ని ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు మరవలేకపోతున్నారు. ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దింపితే, టీడీపీ గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని విశ్వసించే వాళ్ల సంఖ్య ఆ పార్టీలో ఎక్కువే.2024లో మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డూ ఆర్ డై పోరుకు సై అంటూ ముందుకు రావాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. జనసేనతో పొత్తు కోసం నాయుడు లాబీయింగ్ చేస్తున్నారు. జనసేన మళ్లీ టీడీపీ గూటికి వచ్చే అవకాశం ఉండగా, బీజేపీ కూడా చివరి నిమిషంలో కలిసే ఛాన్స్ లేకపోలేదు. మరోసారి చేతులు కలిపేందుకు బీజేపీ అగ్రనేతలు ఇష్టపడటం లేదని పైకి చెబుతున్నప్పటికీ అనివార్యంగా చంద్రబాబు పంచన చేరే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌తో జతకట్టిన తీరు బీజేపీని కలవరపెడుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని దూరంగా పెట్టాలని టీడీపీ భావిస్తోంది. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత రాష్ట్రంలోనూ పడే అవకాశం ఉంది. అందుకే, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాలని బాబు భావిస్తున్నారట. ఆ కూటమి తరపున జూనియర్ స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగితే తిరుగులేని మెజార్టీతో గెలుపు అందుకోవచ్చని అంచనా. సహజంగా పవన్ కు క్రేజ్ ఉంది. ఆయనతో పాటు జూనియర్ కూడా చేతులకలిపి ఒకే వేదికపై కనిపిస్తే, ఎన్నికలకు ముందే చంద్రబాబు విజయం సాధించినట్టు అవుతుంది.
నందమూరి కుటుంబంలో మిగిలిన అందరిలాంటి వాడు కాదు జూనియర్. ఆచితూచి అడుగులు వేస్తారు. చిన్నతనం నుంచి ఆయపడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు ఆయనకు జీవిత పాఠాలు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ మిగిలిన వారి మాదిరిగా రెచ్చపోయే నైజం కాదు. వ్యూహాత్మకంగా రాజకీయ ప్రచారం రంగంలోకి దింపాలని చంద్రబాబు అనుకున్నప్పటికీ ఈసారి జూనియర్ గుడ్డిగా నమ్మే పరిస్థితిలేదు. ఎందుకంటే, 2009 నాటి ఎన్నికల ప్రచారం అనుభవాలు ఆయన్ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఆ కారణంగా సీనియర్లు లైజనింగ్ చేస్తున్నప్పటికీ చాకచక్యంగా ఎన్నికల రంగంలోకి రాకుండా జారుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ రాకుండా 2024 ఎన్నికల్లో చంద్రబాబు 40ఏళ్ల అనుభవం ఏ విధంగా విజయం సాధించగలదో చూడాలి.