CBN Kadapa Tour : జగన్ అడ్డాలో బాబు హవా
ఏపీ సీఎం జగన్ అడ్డా కడప జిల్లాపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కన్నేశారు. ఈసారి కడప జిల్లాలోని కనీసం సగం నియోజకవర్గాల్లో పాగా వేయాలని మాస్టర్ స్కెచ్ వేశారు. ఆ మేరకు ఇప్పటి నుంచే ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళుతున్నారు.
- By CS Rao Published Date - 02:57 PM, Wed - 18 May 22

ఏపీ సీఎం జగన్ అడ్డా కడప జిల్లాపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కన్నేశారు. ఈసారి కడప జిల్లాలోని కనీసం సగం నియోజకవర్గాల్లో పాగా వేయాలని మాస్టర్ స్కెచ్ వేశారు. ఆ మేరకు ఇప్పటి నుంచే ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం ఉండే నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సామాజికవర్గాల పరంగా టీడీపీకి బలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో గెలుపుతో పాటు పులివెందుల జగన్ కోట రహస్యాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. ఇటీవల కడప పర్యటనకు వెళ్లిన ఆయన మూడు రోజుల టూర్ ను ఈసారి ఖరారు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా `బాదుడే బాదుడు` కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆయన ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించారు. అక్కడ వచ్చిన అనూహ్యం స్పందన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. అమరావతి రాజధాని గురించి ఉత్తరాంధ్ర ప్రజల వద్ద ప్రస్తావించారు. ఒకే రాజధాని అమరావతికి ఆమోదముద్ర పడేలా ఉత్తరాంధ్ర సభల్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఇప్పుడు కడప పర్యటనలోనూ ఒకే రాజధాని అమరావతికి ఆమోదం పొందేలా ప్రసంగం చేయనున్నారు. అంతేకాదు, మూడు రాజధానులంటూ జగన్ చేసిన గందరగోళానికి తెరదింపాలని వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల పర్యటనలను తొలి విడత పెట్టుకున్నారు. విశాఖలో `బాదుడేబాదుడు ` కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇప్పుడు కడప జిల్లాలో జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. జగన్ ప్రభుత్వ బాదుడే బాదుడుపై ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటరు ధ్రువీకరణ, మహానాడు ఏర్పాట్లపై మండల, గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహిస్తున్నారు.
పన్నులు, ఛార్జీల పెంపునకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న `బాదుడేబాదుడు` నిరసనలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. మే 18న కడప జిల్లా కమలాపురంలో జరిగే నిరసన కార్యక్రమంలో నాయుడు పాల్గొన్నారు. ఈనెల 19న కర్నూలు జిల్లా ధోన్ నియోజకవర్గంలోని జలదుర్గంలో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. ఈనెల 20న అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగే `బాదుడేబాదుడు` కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం మీద కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం బాబు చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కమలాపురంలో `బాదుడేబాదుడు` నిరసన ప్రదర్శనకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీబట్ల సాయినాథశర్మ కారును అగంతకులు ధ్వంసం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసి, పోస్టర్లు అతికించారు. ఇలాంటి పరిణామాల మధ్య కడప జిల్లాలో అడుగుపెట్టిన బాబుకు అక్కడి క్యాబర్ బ్రహ్మరథం పట్టారు.ఇదే దూకుడును ప్రదర్శించడం ద్వారా జగన్ కోటను బద్దలుకొట్టాలని చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశారట. ఈసారైన ఆయన వ్యూహం ఫలిస్తుందా? లేదా చూడాలి.