ISB Hyderabad : ఐఎస్ బీ జ్ఞాపకాలతో చంద్రబాబు ట్వీట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐఎస్‌బీకి స్నాతకోత్సవానికి వచ్చిన సందర్భంగా మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వరుసగా 17 ట్వీట్లు పోస్ట్ చేశారు.
- By CS Rao Published Date - 04:23 PM, Thu - 26 May 22

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐఎస్‌బీకి స్నాతకోత్సవానికి వచ్చిన సందర్భంగా మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వరుసగా 17 ట్వీట్లు పోస్ట్ చేశారు. ఐఎస్‌బీని హైదరాబాద్‌కు తీసుకురావడానికి క్రమంలో తాను ఏమేం చేశానన్న విషయాలను చంద్రబాబు సవివరంగా సదరు ట్వీట్లలో వివరించారు. గచ్చిబౌలిని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌గా మార్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలోనే తన మదిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ బిజినెస్ స్కూల్ అక్కడ ఏర్పాటైతే గచ్చిబౌలి రూపు రేఖలే మారిపోతాయని భావించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలంతా కలిసి ఓ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన బిజినెస్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని, అందులో భాగంగా దాని పేరును ఐఎస్‌బీగా పెట్టారని, దానికి డైరెక్టర్ల బోర్డు కూడా ఏర్పాటైపోయిందన్న విషయం తెలిసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు
అప్పటికే అభివృద్ధి పరంగా హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందిన ముంబై, బెంగళూరు, చెన్నై.కోల్‌కతా నగరాల్లో దేనిలో ఐఎస్‌బీ పెట్టాలన్న విషయంపై పారిశ్రామిక దిగ్గజాలు తర్జనభర్జన పడుతున్న సమయంలో వారి ముందు హైదరాబాద్ ప్రతిపాదన వచ్చేలా చేశానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం తాను సీఎంని అనే విషయాన్ని మరిచి పారిశ్రామిక దిగ్గజాలతో కలిసిపోయానని, వారికి తానే స్వయంగా భోజనం వడ్డించానని ఆయన వివరించారు.
I extend my congratulations to the Indian School of Business (ISB) on the occasion of their 20th anniversary celebrations. Glad to know that Prime Minister Narendra Modi Ji will attend the graduation ceremony of the Post Graduate Programme Class.(1/17) pic.twitter.com/eugBcyLCz3
— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022
ముంబై, బెంగళూరు కంటే హైదరాబాద్ ఎందుకు బెటర్ అన్న విషయాన్ని వారికి వివరించి చివరకు వారిని ఒప్పించానని చంద్రబాబు ట్వీట్ లో వివరించారు. సుదీర్ఘ కసరత్తులతో జరిగిన ప్రయత్నాలన్నీ ఫలించి ఐఎస్‌బీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా , 2001 డిసెంబర్ 2న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐఎస్‌బీని ప్రారంభించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఐఎస్‌బీ రాకముందు గచ్చిబౌలి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అన్న ఫొటోలతో పాటు ఐఎస్‌బీ ప్రారంభోత్సవానికి వచ్చిన వాజ్‌పేయితో కలిసి ఉన్న ఫొటోలను కూడా చంద్రబాబు తన ట్వీట్లకు జత చేయడం గమనార్హం.