Chandrababu : నాలుగు నెలల్లో కూటమి సర్కార్ రూ. 47 వేల కోట్ల అప్పు – పేర్ని నాని
Chandrababu : చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు
- By Sudheer Published Date - 07:10 PM, Mon - 28 October 24

సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు (Chandrababu) నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్ల (Rs. 47 thousand crores) అప్పులు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. సంపద సష్టిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడమే కాకుండా, ప్రజల ఆస్తులను దొడ్డిదారిన తన అనుచరుల జేబుల్లోకి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో పోర్టుల నిర్మాణంపై జరిగిన పరిణామాలను నాని ప్రస్తావించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు నాలుగు నెలలుగా అటకెక్కాయని పేర్కొన్నారు. జగన్ హయాంలో నిధుల ఇబ్బందులు లేకుండా పోర్టుల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు రూ.3,736 కోట్లతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్నా, ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభానికి దూరమైందని పేర్కొన్నారు.
మచిలీపట్నం పోర్టును ఆరు నెలల్లో పూర్తి చేసి షిప్ తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పని చేయకపోగా, నాలుగు నెలల్లోనే దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5156 కోట్ల వ్యయ అంచనాతో ఆ పోర్టు పనులు మొదలుపెట్టి, 50 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు మణిహారం వంటి మూలపేట పోర్టు పనులు కూడా రూ.4360 కోట్ల వ్యయ అంచనాతో మొదలుపెడితే, చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులు కూడా అటకెక్కించిందని పేర్ని నాని అన్నారు. జగన్ సృష్టించిన వాటి సంపద పంచుకునేందుకు డెవలప్‌మెంట్–ఆపరేషన్–మెయింటెనన్స్ (డీఓఎం) పేరిట అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహించారు.
Read Also : Vizianagaram : మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం