Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి భారీ ఊరట..!!
Vallabhaneni Vamsi : ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) సహా 88 మందికి ఊరట లభించింది
- By Sudheer Published Date - 11:51 AM, Tue - 11 February 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి (Attack on TDP Office) కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) సహా 88 మందికి ఊరట లభించింది. అప్పట్లో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన ఘటనపై పోలీసులు అట్రాసిటీ సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరిన సమయంలో ఫిర్యాదు దారు సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న టీడీపీ ఆఫీసు ఆపరేటర్ సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. తనను బలవంతంగా సాక్షిగా పెట్టారని, అప్పట్లో తన సంతకం తీసుకున్నారని ఆయన కోర్టు ఎదుట వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో తాను అక్కడే లేకపోయినప్పటికీ తన పేరును జోడించారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
‘Sanatana Dharma’ Tour : రేపటి నుండి పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ’ టూర్
సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో వల్లభనేని వంశీ సహా 88 మంది ఈ కేసులో బయటపడే అవకాశముంది. అసలు దాడికి సంబంధించి ప్రధాన సాక్షి వెనక్కి తగ్గడంతో ఈ కేసు న్యాయపరంగా నిలవదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పటికీ, కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ కేసును తిరిగి విచారణలోకి తెచ్చింది. ఈ కేసు వల్లభనేని వంశీకి న్యాయపరంగా ఊరట కలిగించినప్పటికీ, ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్న కేసుగా మారినట్లు కనిపిస్తోంది.