Bharat Forge In AP: ఏపీలో 2400 కోట్లతో భారత్ ఫోర్జ్ పెట్టుబడి..!
భారత్ ఫోర్జ్ లిమిటెడ్ (BFL) రాష్ట్రంలో భారీ రక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రతిపాదన ఇచ్చింది. తమ అనుబంధ కంపెనీ కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (KSSL) ద్వారా ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీకి పరిశ్రమను ఏర్పాటుచేయనుంది.
- By Kode Mohan Sai Published Date - 11:55 AM, Mon - 18 November 24

Bharat Forge In AP: రక్షణ రంగంలో ఒక భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం ఖాయమైంది. యుద్ధరంగంలో వినియోగించే ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీకి ప్రసిద్ధి చెందిన భారత్ ఫోర్జ్ లిమిటెడ్ (BFL), తన అనుబంధ కంపెనీ కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (KSSL) ద్వారా కొత్త పరిశ్రమ స్థాపనకు ప్రతిపాదన ఇచ్చింది. సంస్థ, అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జిటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్స్, ప్రొటెక్టెడ్ వాహనాలు, ఆర్మర్డ్ వాహనాల అప్‌గ్రేడ్, మందుగుండు సామగ్రి, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, మరియు ఏరోస్పేస్ వంటి రంగాలలో పని చేయనున్నారు. దీనితో పాటు ఆటోమోటివ్, విద్యుత్, ఆయిల్ & గ్యాస్, నిర్మాణ, మైనింగ్, మెరైన్, రైల్వే కోచ్‌ల తయారీకి కూడా సంస్థ పరికరాలను సరఫరా చేస్తుంది.
రెండు దశల్లో అభివృద్ధి చేసే ఈ ప్లాంటు కోసం 2,400 కోట్ల రూపాయల పెట్టుబడులను సంస్థ ప్రతిపాదించింది. ఈ పరిశ్రమ ద్వారా భారతదేశంతో పాటు విదేశాలకు కూడా రక్షణ సామగ్రి సరఫరా చేయడం లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా 550 మంది స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ కార్మికులకు ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
మొదటి దశ కోసం కనీసం 1,000 ఎకరాల భూమి అవసరమని, రెండవ దశ కోసం మరో 500 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి అభ్యర్థించింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి, ఆర్. అనంతపురం గ్రామాల పరిధిలోని భూములను ఇప్పటికే పరిశీలించినట్లు సంస్థ తెలిపింది. యుద్ధసామగ్రి సామర్థ్యాన్ని అంతర్గతంగా పరిశీలించడానికి ఈ భూములు అవసరమని సంస్థ పేర్కొంది.
మొదటి దశలో పథకంలో ప్రతిపాదించిన కార్యకలాపాలు:
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్లాంటులో మందుగుండు, ఫిరంగుల షెల్స్ మరియు ఇతర రక్షణ రంగ పరికరాలను తయారుచేసే దిశగా సంస్థ ప్రణాళికలు వేస్తోంది. మొదటి దశలో రూ. 1,000 కోట్లతో ప్లాంట్ స్థాపించాలన్న అభ్యర్థనను సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కీలక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మందుగుండు సామగ్రి ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు ప్రతిపాదనలో వివరించింది. ఆ సంస్థ ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం..
2024: ప్లాంటు ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమి సేకరణ, భవిష్యత్ విస్తరణ కోసం అదనపు భూముల గుర్తింపు.
2025: ప్రతి ఏడాది 2 లక్షల మందుగుండు ఫిరంగుల్లో నింపే షెల్ ఫిల్లింగ్ యూనిట్, 3,500 టన్నుల టీఎన్‌టీ తయారీ ప్లాంటు.
2026: గన్‌ప్రొపెల్లెంట్స్ (బయో-మాడ్యులర్ ఛార్జ్ సిస్టం – BCMs) ద్వారా నెలకు 10-20 వేల మాడ్యూల్స్ తయారీ ప్లాంటు.
2027: ఇతర ఎనర్జిటిక్స్ (వార్ హెడ్‌లు, బాంబుల కోసం పాలిమర్‌తో నిండిన ప్రొపెల్లెంట్‌లు; 50 టన్నుల రాకెట్ ప్రొపెల్లెంట్, 50 టన్నుల పాలిమర్-బాండెడ్ యూనిట్ల తయారీ).
2029: అడ్వాన్స్‌డ్ ఎనర్జిటిక్స్ (రాకెట్ మోటార్ల కోసం కాంపోజిట్ ప్రొపెల్లెంట్లు, హై పెర్ఫార్మెన్స్ గన్ ప్రొపెల్లెంట్).
ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగంలో అవసరమైన పరికరాలను తయారుచేసేందుకు సంస్థ పూర్తి స్థాయి సాంకేతికతను వినియోగించుకోనుంది.
రెండో దశలో పథకంలో ప్రతిపాదించిన కార్యకలాపాలు:
రెండో దశలో పాలిమర్ బాండెడ్ ఎక్స్‌ప్లోజివ్ ప్రాసెసింగ్ ప్లాంటు మరియు అడ్వాన్స్‌డ్ ఎనర్జిటిక్స్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మందుగుండు మార్కెట్ తీవ్రంగా పెరుగుతోందని, 2023లో ప్రపంచవ్యాప్త ఆయుధ మార్కెట్ డిమాండ్ ₹1.29 లక్షల కోట్లకు చేరుకున్నప్పుడు, అందులో మందుగుండు సామగ్రి వాటా 53% వరకు ఉందని సంస్థ వివరించింది.