Jagan : జగన్ అధికారులను ప్రక్షాళన చేయబోతున్న బాబు..?
జగన్ కు దగ్గరగా ఉన్న అధికారుల ఫై కూడా వేటు వేసేందుకు చంద్రబాబు సిద్ధం అయినట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 12:05 PM, Thu - 6 June 24

ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీ తో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 12 చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే తరుణంలో జగన్ కు దగ్గరగా ఉన్న అధికారుల ఫై కూడా వేటు వేసేందుకు చంద్రబాబు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. జగన్ ఏంచేసినా అడ్డు చెప్పకుండా..చూస్తూ ఉండిపోయిన అధికారులకు షాక్ ఇవ్వబోతున్నారు బాబు. వీరిలో ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఫై వేటు వేయబోతున్నారని వినికిడి. దీనికి నిదర్శనం మొన్న జరిగిన సంఘటనే.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో కూటమి విజయం సాదించగానే చంద్రబాబు ను పలువురు IAS లతో పాటు కేఎస్ జవహర్ రెడ్డి వెళ్లారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి, మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలోనే కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా, ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు వినికిడి.
అలాగే చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించిన DIG కొల్లి రఘురామిరెడ్డి, జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన PSR ఆంజనేయులుకు చంద్రబాబును కలిసేందుకు అధికారులు అనుమతించలేదు. అటు రఘురామిరెడ్డిని అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్ నిర్ణయాలకు సపోర్ట్ గా ఉన్నవారిపై వేటు వేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
Read Also : Fake News : చంద్రబాబు పాత ఫోటోతో ఫేక్ న్యూస్ ప్రచారం..