YSRCP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారనే అభియోగాలపై రోళ్ల మండలానికి చెందిన ఇద్దరు, గుడిబండ మండలానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సోషల్ మీడియాలో పోస్టుల వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
కొన్ని రోజులుగా ప్రభుత్వంపై వీరు ఇష్టమొచ్చిన కామెంట్లు, అసభ్యకర పోస్టులు పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన ఈ ముగ్గురిపై చర్యలకు దిగింది. మరోవైపు, తమ పార్టీ వారిని అరెస్ట్ చేయడంతో స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు.