AP Liquor Scam: వచ్చే వారం సంచలనాలు జరగబోతున్నాయా..?
AP Liquor Scam: ఈ లిక్కర్ కేసులో తన పేరు కూడా వినిపిస్తుండటం వల్లనే జగన్ వెళ్లడం లేదని చెబుతున్నారు. జగన్ అరెస్టు ప్రచారం కారణంగా ఇప్పటికే తన లీగల్ టీమ్‌ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 11:16 PM, Thu - 31 July 25

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం (AP Liquor Scam) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సిట్ (SIT) బృందం దర్యాప్తులో భాగంగా దుబాయ్, ముంబైలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో లిక్కర్ స్కాం నిందితులు తలదాచుకున్నారని, అక్కడ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించారని సమాచారం. అక్కడి ఆధారాలు, నిందితుల కార్యకలాపాల పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు గుర్తించి, ఆ షెల్ కంపెనీల ఆచూకీ, డైరెక్టర్ల వివరాలు, వాటి గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు ఒక బృందం ముంబైకి వెళ్లింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో మొత్తం నగదు చెలామణి గుట్టును సిట్ బృందాలు బయటకు లాగుతున్నాయి.
దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో, సిట్ దర్యాప్తు బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు పురోగతిని వివరించింది. తాజాగా బయటపడిన ఆధారాలు, ఇంకా సోదాలు చేయాల్సిన ప్రాంతాలతో పాటు, మరో పది రోజుల్లో దాఖలు చేయాల్సిన అదనపు చార్జిషీటు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరో నలుగురు కీలక వ్యక్తుల పాత్ర బయటపడిందని, వారిపై పక్కా ఆధారాలు ఉన్నాయని, వారిని ఈ స్కామ్‌లో బలంగా చూపిస్తూ అదనపు చార్జిషీటు దాఖలు చేయాల్సిన అంశంపై చర్చించారు. ఈ అంశంలో ఎలాంటి చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేయాలని, సూత్రధారులను కూడా అరెస్టు చేయాలని భావిస్తున్నారు.
మరో పది రోజుల్లో దాఖలు చేయబోతున్న అదనపు చార్జిషీటులో ఉండబోయే నలుగురు కీలక వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. కారణం ఏదైనా లిక్కర్ స్కాంపై ఆయన ఎక్కువగా మాట్లాడకపోవడం, చాలా మంది వైసీపీ నేతలు జైలుకు వెళ్తున్నా వారిని జగన్ వెళ్లి పరామర్శిస్తున్నా, లిక్కర్ కేసులో అరెస్టు అయిన వారిని మాత్రం పరామర్శించేందుకు వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తనకు అత్యంత సన్నిహితులైన మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి వంటి వారు అరెస్టు అయినా వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఈ లిక్కర్ కేసులో తన పేరు కూడా వినిపిస్తుండటం వల్లనే జగన్ వెళ్లడం లేదని చెబుతున్నారు. జగన్ అరెస్టు ప్రచారం కారణంగా ఇప్పటికే తన లీగల్ టీమ్‌ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. చార్జిషీటులో ఇప్పటికే తన పేరు ప్రస్తావించినా, ఇంకా నిందితుడిగా చేర్చలేదు. నిందితుడిగా చేర్చిన వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. జగన్‌ను నిందితుడిగా చేర్చినా, ఇతర నిందితులకు అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు కల్పించినట్లే జగన్‌కు కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లే అవకాశాలు కల్పించిన తర్వాతనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా, వచ్చే పది రోజుల్లో లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామాలు ఉండబోతున్నాయని ఏపీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.