AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్
- Author : Prasad
Date : 01-06-2026 - 1:05 IST
Published By : Hashtagu Telugu Desk
డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నాయకత్వం కోర్టుల్లో వందలాది కేసులు వేసిందని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలతో యువతను ఆకర్షించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేదని రవినాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీ టీచర్ పోస్టులు లేవని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కేవలం 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి, అది కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడేలా చేశారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, 16,300కు పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు.
డీఎస్సీ నియామకాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కోర్టుల్లో సుమారు 240 కేసులు దాఖలయ్యాయని ఆయన ఆరోపించారు. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో, అధికారులు మరియు న్యాయ నిపుణుల సహకారంతో అన్ని అడ్డంకులను అధిగమించి డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టులపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన రవినాయుడు, ఆ నియామకాల ప్రక్రియపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అవకతవకలపై వైసీపీ నుంచి ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు.