AP Minister: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి
ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 50ఎకరాలు కొనొచ్చు. వైజాగ్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. అక్కడ ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో మూడెకరాలు కొనవచ్చుఅంటూ ఏపీ మంత్రి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
- Author : News Desk
Date : 22-06-2023 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగుతుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతల మధ్యకూడా కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో పరిస్థితులను ఎద్దేవా చేస్తూ తెలంగాణ మంత్రులు (Telangana Ministers) వ్యాఖ్యలు చేయడం, వారి వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా సీఎం కేసీఆర్ (CM KCR) సైతం ఏపీలో జగన్ పాలనపై సెటైర్లు వేశారు. గురువారం పటాన్ చెరులో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభోత్సవంతో పాటు, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనవచ్చని చంద్రబాబు అనేవారు. ఇప్పుడు భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో భూముల ధరలు భాగా పెరిగాయి. ఏపీలో తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తారుమారైందని, ఇటీవల చంద్రబాబే స్వయంగా చెప్పారని కేసీఆర్ అన్నారు. మంచి ప్రభుత్వం, అభివృద్ధి పనులతో భూముల ధరలు పెరుగుతాయి అంటూ ఏపీలో జగన్ సర్కార్‌పై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. వైజాగ్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయని, అక్కడ ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో మూడెకరాలు కొనవచ్చునని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాలు గురించి అక్కడి అధికార పార్టీ నేతలు మాట్లాడాలంటూ మంత్రి సూచించారు. ఏపీలో అద్భుతమైన పాలన సాగుతుందని, పేద వర్గాల ప్రజలు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారని, మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెద్దలు ఏపీపై అవాకులు చవాకులు పేలడం మాని అక్కడ అభివృద్ధిపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు.