YS Jagan : జగన్ మరో సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్‌లకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌లుగా పదోన్నతి కల్పించింది
- By CS Rao Published Date - 12:16 PM, Mon - 15 August 22

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్‌లకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌లుగా పదోన్నతి కల్పించింది. ఆ శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్వే ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరింది. సర్వే శాఖలో సర్వేయర్‌గా చేరిన వారు ఆ శాఖ ప్రారంభం నుంచి ఎలాంటి పదోన్నతులు లేకుండానే సర్వేయర్‌గా పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. 1971లో సర్వే విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు సరిహద్దు వివాదాల పరిష్కారం, భూసేకరణ, భూ రికార్డుల నిర్వహణ కోసం తహసీల్దార్ కార్యాలయాలకు ఒక సర్వేయర్‌ను నియమించారు. అప్పటి నుంచి ప్రభుత్వ భూ పంపిణీ, భూ యజమానుల అవసరాలు, ఇళ్ల పట్టాల సర్వే, ప్రాజెక్టులకు భూసేకరణ, పారిశ్రామికీకరణ కోసం భూ సర్వే, రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు పెరిగినా సర్వేయర్ల సంఖ్య పెరగలేదు.
గతంలో కనీసం 2 వేల మంది అదనపు సర్వేయర్లు కావాలని ఉద్యోగులు కోరారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సర్వే అవసరాలు, రీ సర్వే కోసం 11,118 కొత్త గ్రామ సర్వేయర్ పోస్టులను నియమించగా ఇప్పుడు తాజాగా 101 సర్వేయర్లకు పదోన్నతులు లభించగా మిగిలిన క్యాడర్లకు కూడా త్వరలో పదోన్నతులు లభించనున్నాయి.