AP Govt : 9 కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
AP Govt : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహించిన SIBP (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు
- By Sudheer Published Date - 08:34 PM, Mon - 30 December 24

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP Govt) మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా 9 కొత్త ప్రాజెక్టులకు (9 New Projects) ఆమోదం లభించింది. బీపీసీఎల్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలతో సహా ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు ఉత్సాహం చూపించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సారథ్యంలో నిర్వహించిన SIBP (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన వస్తోందని , ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. పెట్టుబడుల విలువ దాదాపు రూ. 1,82,162 కోట్లుగా ఉండనుండగా, దీని ద్వారా 2,63,411 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు ఉపాధి అవకాశాల పెంపుదల ఉద్దేశ్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వివరించారు. ప్రత్యేకంగా క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు ప్రవహించడం రాష్ట్రానికి సానుకూలమైన పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు నచ్చే గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలప్రదమవుతోందని చంద్రబాబు తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో తమ వ్యాపారాలు విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. పెట్టుబడుల అమలులో తక్షణ చర్యలు తీసుకొని, ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also : Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!