AP Economic Growth : ఆర్ధికంగా బలపడుతున్న ఏపీ..ఇది కదా బాబు మార్క్ అంటే !!
AP Economic Growth : గత వైసీపీ హయాంలో ఏపీ ఎంత దారుణంగా ఉండేదో తెలియంది కాదు. పెట్టుబడులు లేక , పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలను పలు రకాలుగా భయపెట్టడం , రాష్ట్ర మేలు కంటే స్వలాభం చూసుకోవడం , మద్యం మాఫియా
- By Sudheer Published Date - 09:37 AM, Fri - 5 December 25
గత వైసీపీ హయాంలో ఏపీ ఎంత దారుణంగా ఉండేదో తెలియంది కాదు. పెట్టుబడులు లేక , పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలను పలు రకాలుగా భయపెట్టడం , రాష్ట్ర మేలు కంటే స్వలాభం చూసుకోవడం , మద్యం మాఫియా , ఇసుక మాఫియా , భూ కబ్జాలు ఇలా ఒక్కటి ఏంటి ఎన్ని చేయాలో అన్ని చేసారు. దీంతో ఏపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ..రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టె పనిలో పడింది. ఏడాది తిరిగేలోపే పోయిన సంస్థలు ఏపీకి తరలి వచ్చేలా , ఆర్థికవృద్ధి మెరుగుపడేలా చేసి చంద్రబాబు తన మార్క్ కనపరుస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మందగమనం ఎదుర్కొన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (మొదటి త్రైమాసికం) రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ఏకంగా 10.5 శాతం వృద్ధి సాధించింది. దేశవ్యాప్తంగా సగటు వృద్ధిరేటు 8.8 శాతంగా ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ దాన్ని దాటి ముందుకు దూసుకెళ్లడం విశేషం. ఈ అద్భుతమైన వృద్ధి వేగం కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు రూ. 18.65 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జ్యూస్ లు తీసుకోవాలో మీకు తెలుసా?
ఈ ఆర్థిక పునరుజ్జీవనంలో అన్ని ప్రధాన రంగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం మొదటి త్రైమాసికంలో 9.6 శాతం వృద్ధి చెంది, మొత్తం ఉత్పత్తిని రూ.81,496 కోట్లకు చేర్చింది. గత సంవత్సరంతో పోలిస్తే వ్యవసాయం ఏకంగా 36% పైగా వృద్ధి సాధించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గట్టి బలం చేకూర్చింది. దీనికి తోడు సేవల రంగం (Services Sector) 8.5 శాతం, పరిశ్రమల రంగం (Industries Sector) 23 శాతం పైగా వృద్ధిని నమోదు చేశాయి. ఈ మూడు కీలక రంగాల ఏకకాల వృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్యం ఈ వృద్ధికి దిశా నిర్దేశం చేస్తోంది. ఈ విజన్ ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం $2.4 లక్షల కోట్ల డాలర్లకు, తలసరి ఆదాయం సుమారు రూ.35 లక్షలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంతర పర్యవేక్షణ విధానం ఈ వృద్ధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. 512 ముఖ్య సూచికలతో అన్ని శాఖల పనితీరును పర్యవేక్షించడం ద్వారా పథకాలు వేగంగా అమలవుతున్నాయి. విదేశీ పెట్టుబడులు (FDI) తిరిగి రావడం (2019-24 మధ్య రూ.9,397 కోట్లు) కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 38 శాతం వాటా కలిగి ఉండటం (సుమారు $7.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ఒక అదనపు బలం. అయితే, మే, అక్టోబర్ నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు కొంత తగ్గడం వంటి తాత్కాలిక సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతుల బలం వల్ల ఈ సమస్య తొలగిపోతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, ద్రవ్యోల్బణం 2.1 శాతానికి పడిపోవడం వంటి ఆర్థిక అంశాలు కూడా ఈ పునరుజ్జీవనానికి మద్దతు ఇస్తున్నాయి.