AP Employees: ఏపీ ఉద్యోగుల భరతం పట్టనున్న జగన్
మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ నెరవేర్చిన ప్రభుత్వాలు ఈ ప్రపంచంలోనే లేవు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను యథాతదంగా అమలు చేయడం ఏ పార్టీకైనా అసాధ్యం. ఆ విషయం సామాన్యుల కంటే ఉద్యోగులకు బాగా తెలుసు.
- By CS Rao Published Date - 11:57 AM, Mon - 25 April 22

మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ నెరవేర్చిన ప్రభుత్వాలు ఈ ప్రపంచంలోనే లేవు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను యథాతదంగా అమలు చేయడం ఏ పార్టీకైనా అసాధ్యం. ఆ విషయం సామాన్యుల కంటే ఉద్యోగులకు బాగా తెలుసు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ కూడా ఉద్యోగులు నేలవిడిచి సాము చేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్న టైంలో ఆడింది ఆట పాడింది పాటగా స్వేచ్ఛను అనుభవించారు. ప్రజాధనాన్ని జీతాల రూపంలో ఇష్టాసారంగా పెంచుకునేలా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. గొంతెమ్మ కోర్కెలను తీర్చుకున్నారు. ఇప్పుడు జగన్ హయాంలో వాళ్ల ఆటలు సాగడంలేదు. అందుకే, సీపీఎస్ రద్దును తెర మీదకు తీసుకొచ్చారు. మేనిఫెస్టోలోని మిగిలిన అంశాలపై మాత్రం ఉద్యోగులు నోరెత్తడంలేదు.
2019 ఎన్నికల సందర్భంగా మద్యనిషేధం, సీపీఎస్, రుణాల మాఫీ, రూ. 3వేల పెన్షన్..ఇలా నవరత్నాల రూపంలో జగన్ ఎన్నో హామీలను ఇచ్చారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. అదేమీ లేకుండా కేవలం వాళ్ల స్వార్థం కోసం సీపీఎస్ రద్దు మాత్రమే ఎజెండాగా తీసుకుని రోడ్ల మీదకు వచ్చారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి రావడం ద్వారా జీతాలను పెంచుకున్నారు. సామాన్యుల జీడీపీ, తలసరి ఆదాయం, అదుపు తప్పిన ద్రవ్యోల్బణం తదితరాలు ఉద్యోగులకు పట్టవు. వాళ్ల జీవితం విలాసవంతంగా ఉంటే చాలు. ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అయినా పట్టించుకోరు. ప్రభుత్వాలపై పెత్తనం చేస్తూ వాళ్ల పబ్బం గడుపుకోవడానికి ఎప్పుడూ జలగల్లా ప్రజల్ని పీడించే వర్గం ఏదైనా ఉందంటే సంఘటితంగా ఉండే ఉద్యోగులే.
సీఎం జగన్, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య ప్రచ్చన్నయుద్ధం మళ్లీ మొదలైయింది. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ జీతాలు పెంచాలని రోడ్లపైకి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోమవారం సీపీఎస్ రద్దు డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు. కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధంగా ఉండే యూటీఎఫ్ లాంటి సంఘాలు ఎక్కువగా జగన్ పై కన్నెర్ర చేసిన విషయం విదితమే. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునివ్వడంతో విజయవాడలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరమంతటా 144 సెక్షన్ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. దావులూరు, పొట్టిపాడు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు.
రైలు, రోడ్డు మార్గాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు విజయవాడ, గుంటూరుకు చేరుకోకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద పూర్తి నిఘా ఉంచారు. సెల్ ఫోన్లు, ఐడీ కార్డులు చెక్ చేసి పంపుతున్నారు. ఇప్పటికే దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. యూటీఎఫ్ చేపట్టిన నిరసనకు అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
పీఆర్సీ కోసం రోడ్లపైకి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను అదుపుచేయలేకపోయిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఇటీవల వేటు పడింది. ఆనాడు పోలీసులు కూడా ఉద్యోగులకు సహకారం అందించారు. ఆ మేరకు నిఘా వర్గాల సమాచారం కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఈసారి అలాంటి పొరబాటు జరగకుండా ప్రస్తుతం ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ కేంద్రంగా ఉండే సంఘాల నాయకులు, విపక్ష పార్టీల క్యాడర్ సహకారంతో రోడ్లపైకి గతంలో మాదిరిగా రావడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకే, విజయవాడ మొత్తం పోలీసులు దిగ్బంధం చేశారు. సీపీఎస్ రద్దు పై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. మొండిపట్టుతో ఉద్యోగులు ప్రభుత్వంపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతోంది. ఇలాంటి పరిణామం వెనుక ఎవరున్నారో తేల్చడానికి ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. సీఎం జగన్ ఈసారి ఉద్యోగులను ఊదాసీనంగా వదలకుండా తడాఖా చూపాలని చేస్తోన్న ప్రయత్నం ఫలిస్తుందా? లేదా చూడాలి.