Auto Driver: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్, 8 లక్షలు నగల బ్యాగ్ అప్పగింత!
- By Balu J Published Date - 12:28 PM, Sat - 30 December 23

Auto Driver: విజయవాడకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన నగల బ్యాగును మహిళకు అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. విజయవాడలో బంధువుల పెళ్లికి వెళ్లిన నవీన అనే వివాహిత నెల రోజుల పాపతో కలిసి ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు ఆటోలో ప్రయాణించారు. నవీనా తన బిడ్డకు పాలు పట్టింది. ఈ క్రమంలో ఆమె అనుకోకుండా తన పక్కన ఉన్న సీటుపై నగల బ్యాగ్‌ను వదిలివేసింది. బ్యాగ్ ఉన్న సంగతి తెలియని నాగేశ్వరరావు నవీనను దించి ఇంటికి చేరుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం అతను తన ఆటోను స్టార్ట్ చేస్తున్నప్పుడు విలువైన నగలు ఉన్న బ్యాగ్‌ని గుర్తించాడు. అందులోని 8 లక్షల విలువైన నగలు ఉన్నప్పటికీ నాగేశ్వరరావు అత్యాశకు పోలేదు. వెంటనే ఆ బ్యాగ్ నవీనది అని గుర్తించి, దానిని ఆమెకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు అందించాడు. దీంతో నవీన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నాగేశ్వరరావు నిజాయితీని విని, అతని తోటి ఆటోడ్రైవర్లు అతనిని అభినందించి ప్రశంసించారు. ఆటో అసోసియేషన్ కూడా నాగేశ్వరరావు చిత్తశుద్ధికి అభినందనలు తెలియజేసింది.