Accident : మరో ప్రవైట్ బస్సు ప్రమాదం..ఇద్దరు మృతి
Accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషాదం
- By Sudheer Published Date - 12:29 PM, Sun - 23 November 25
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది మృతి చెందిన విషాదం ఇంకా మరువకముందే, తాజాగా అదే జిల్లాలోని నంద్యాల సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు-చిత్తూరు నేషనల్ హైవేపై, ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుర్ఘటన సంభవించింది. మైత్రి ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు, దాని ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం ప్రారంభమైంది. అయితే, ఆగిన బస్సును వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగి, బస్సు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ త్రిపుల్ యాక్సిడెంట్‌లో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Smriti Mandhana: స్మృతీ మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు హర్షోలాసంగా
హైదరాబాదు నుంచి పుదుచ్చేరికి ప్రయాణిస్తున్న ఈ బస్సు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బస్సు వెనుక భాగంలో ఉన్న F4 బెర్త్‌లో ఉన్న హరిత మరియు F6 బెర్త్‌లో ఉన్న బద్రీనాథ్ అనే ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. వీరిద్దరూ హైదరాబాదులోని ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు పది మందికి గాయాలు కాగా, వారిని వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు; గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ను కూడా ఎంతో శ్రమించి బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ప్రయాణికుల పూర్తి వివరాల కోసం ప్రజలు 9121101166 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.