Tirumala: తిరుమలలో మరో చిరుత..పట్టుకున్న అధికారులు
తిరుమలలో చిరుతల భయం పట్టుకుంది. కాలినడకన వెళ్లే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా తిరుమలకు వెళ్లే దారిలో ఓ పాపను చిరుత లాక్కెళ్లి చంపేసిన ఘటన వెలుగు చూసింది.
- By Praveen Aluthuru Published Date - 11:09 AM, Thu - 17 August 23

Tirumala: తిరుమలలో చిరుతల భయం పట్టుకుంది. కాలినడకన వెళ్లే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా తిరుమలకు వెళ్లే దారిలో ఓ పాపను చిరుత లాక్కెళ్లి చంపేసిన ఘటన వెలుగు చూసింది. అప్పటివరకు అమ్మానాన్నలతో కబుర్లు చెప్పిన చిన్నారి లక్షిత క్షణాల్లో చిరుత దాడికి బలైంది. చిన్నారిపై దాడి చేసిన చిరుతను సంబంధిత అధికారులు పట్టుకున్నారు. తాజాగా అదే దారిలో మరో చిరుత సంచరించింది. బుధవారం అర్ధరాత్రి ఆ చిరుతను కూడా పట్టుకున్నారు. ఆరేళ్ల లక్షిత మృతి చెందిన తర్వాత పట్టుకున్న చిరుత ఇది రెండోది కాగా, 50 రోజుల్లో ఆ దారిలో మూడు చిరుతలు పట్టుబడ్డాయి. అటవీశాఖ అధికారులు దారి ఇరువైపులా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించారు.
బుధవారం అర్ధరాత్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని బోనులో చిరుతపులి చిక్కుకుపోయినట్లు సిబ్బంది గుర్తించారు. చిక్కుకున్న చిరుత గాయపడడంతో చికిత్స నిమిత్తం ఎస్వీ జూకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శేషాచలం అడవుల్లో 40కి పైగా చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో దాదాపు పది చిరుతలు గుడికి వెళ్లే మెట్ల దగ్గరకు వస్తున్నాయి. దీంతో మెట్ల దారికి ఇరువైపులా కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతపులి కదలికలను గుర్తించేందుకు దాదాపు 500 కెమెరాలు అమర్చారు.
Also Read: Andhra Pradesh : బాల్య వివాహాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు