TDP Vs YSRCP : ఏపీ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తం, ఎద్దుల బండిలాగి టీడీపీ నేతల నిరసన
ఏపీ పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు.
- Author : CS Rao
Date : 19-09-2022 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, రైతుల సమస్యల తీవ్రతను తెలియచేసేలా టీడీపీ నేతలు ఎద్దులబండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఎద్దులను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. వాటిని కూడా అరెస్ట్ చేశారని టీడీపీ సెటైర్లు వేయడం మొదలు పెట్టింది. ఎద్దుల్ని పోలీసులు తీసుకుపోవడంతో బండి కాడి ఇరువైపులా లోకేష్ తో సహా టీడీపీ నేతలు ఉంటూ అసెంబ్లీ వైపు లాక్కెళ్లి నిరసన చేయడం హైలెట్‌గా నిలిచింది.
ఎద్దులతో పాటు కొద్దిసేపటికి బండిని కూడా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. బండి టైర్లలో గాలితీసేశారు. దీంతో టీడీపీ నేతలు తుళ్లూరు పోలీస్టేన్ ఎదుట ధర్నాకు దిగారు. ‘రైతు ద్రోహి జగన్’, ‘కనీస మద్దతు ధర ఎక్కడిది’, ‘రైతు వర్సెస్ ఫ్యాక్షన్’, ‘జగన్ పాలనలో క్రాప్ హాలిడే’ వంటి నినాదాలతో టీడీపీ శాసనసభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ రైతు సెల్ నాయకులు, కార్యకర్తల నిరసనతో మంత్రుల కాన్వాయ్‌లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బలగాలను ప్రయోగించారు.
ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరసనతో రాష్ట్ర సచివాలయానికి వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాన్వాయ్‌లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. వీఐపీ కాన్వాయ్‌ల ఎస్కార్ట్ వాహనాల సైరన్‌లతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది.
ఈ అరెస్టులను టీడీపీ నేతలు ఖండిస్తూ నిరసన తెలపడం తమ హక్కు అని వాదించారు. రైతుల సమస్యలను ఎత్తిచూపేందుకు తాము చేపట్టిన శాంతియుత నిరసనను బలప్రయోగంతో భగ్నం చేశారన్నారు. పోలీసులను ఉపయోగించుకుని ఎంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు.