Mega PTM 2.0: గిన్నిస్ రికార్డు కొట్టబోతున్న మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0
Mega PTM 2.0: ఈ కార్యక్రమంలో మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొననుండటం విశేషం. అందులో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు
- By Sudheer Published Date - 07:17 AM, Thu - 10 July 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించిన ఆలోచనకు ప్రతిఫలంగా, రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘మెగా టీచర్-పేరెంట్ మీట్ 2.0’ (Mega PTM 2.0) నిర్వహిస్తోంది. ఒకేరోజు రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య సమితులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.
Cold Feet : మీ పాదాలు తరచూ చల్లగా ఉంటున్నాయా? ఇది సాధారణం కాదు!.. వైద్య నిపుణుల హెచ్చరిక
ఈ కార్యక్రమంలో మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొననుండటం విశేషం. అందులో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు. విద్యార్థుల అభివృద్ధిపై చర్చించడానికి, తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించడానికి ఇది ఒక పెద్ద వేదికగా మారనుంది. గత సంవత్సరం మెగా పీటీఎం ఘనవిజయం సాధించడంతో, ఈ ఏడాది మరింత ప్రాధాన్యంతో నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతివేళా పండుగ వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఈ సమావేశంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తల్లికి వందనం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అవగాహన, డ్రగ్స్, సైబర్ క్రైమ్ అవగాహన, తల్లుల పేరుపై మొక్కలు నాటించడం, పేరెంట్స్-స్టూడెంట్ ఫొటో సెషన్లు, ఉపాధ్యాయులతో వ్యక్తిగత చర్చలు, సహపంక్తి భోజనం వంటివి ఉన్నాయి. మొక్కలు నాటిన విద్యార్థులకు ‘గ్రీన్ పాస్‌పోర్టులు’ అందించనున్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు తమ తల్లుల పేరిట మొక్కలు నాటుతారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి పుట్టపర్తి చేరుకొని, కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌లో మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని తిరిగి విజయవాడకు బయలుదేరుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమం విద్యా రంగంలో మార్పుకు దారి చూపనుంది.