Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు
- Author : Prasad
Date : 21-06-2026 - 8:05 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రేమకు దేశాలు, భాషలు, సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. పల్నాడు జిల్లా దేచవరం గ్రామానికి చెందిన యువకుడు యంపాటి వెంకటేశ్వర్లు జర్మనీకి చెందిన అలెనా అనే యువతిని వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడ అలెనాతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. కాలక్రమేణా ఆ పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు జర్మనీలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇరు కుటుంబాల అంగీకారం, ఆశీస్సులతో ఈ జంట వివాహం నరసరావుపేటలోని A1 కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.
ఈ పెళ్లి వేడుక ప్రత్యేకత ఏమిటంటే.. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు విధాలుగా వివాహ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి, పాశ్చాత్య సంప్రదాయాల సమ్మేళనంగా జరిగిన ఈ వేడుకకు భారత్, జర్మనీ, రష్యా దేశాల నుంచి బంధుమిత్రులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అంతర్జాతీయ ప్రేమకథకు నిదర్శనంగా నిలిచిన ఈ వివాహం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొత్త జీవితంలో అడుగుపెట్టిన వెంకటేశ్వర్లు – అలెనా దంపతులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.