Gate Exam: శభాష్ మాస్టారూ! 64 ఏళ్ల వయసులో గేట్ లో 140వ ర్యాంక్ సాధించిన ఏపీ రిటైర్డ్ ఇంజనీర్
- By HashtagU Desk Published Date - 09:47 AM, Sat - 19 March 22

సాధించాలన్న సంకల్పం ఉండాలే కాని దానికి వయసుతో పనేముంది. ఆ మాటకొస్తే.. పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేసింది.. సంస్థలను ఏర్పాటు చేసింది రిటైర్ మెంట్ ఏజ్ దాటినవారే. వాళ్లకు తానేం తీసిపోనంటూ ఆంధ్రప్రదేశ్ లో ఓ రిటైర్డ్ ఇంజనీర్ 64 ఏళ్ల వయసులో గేట్ పరీక్షలో నేషనల్ లెవల్లో 140వ ర్యాంక్ సాధించారు. నిజానికి గేట్ పరీక్ష కోసం విద్యార్థుల మధ్య జాతీయస్థాయిలో తీవ్రమైన పోటీ ఉంటుంది.
అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో ఇంజనీర్ గా 39 ఏళ్లు పనిచేశారు. రిటైర్ అయిన తరువాత అందరిలా ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ఇంకా ఉన్నత చదువులు చదవాలన్న తన అభిలాషను నెరవేర్చుకున్నారు. దానికోసం రిటైర్ అయ్యాక.. జేఎన్టీయూలో సివిల్ విభాగంలో ఎంటెక్ లో చేశారు. 2022లోనే ఆ కోర్సు పూర్తిచేశారు. ఆ తరువాత గేట్ పరీక్ష రాశారు.
సత్యనారాయణరెడ్డి.. 2018లో డీఈఈగా రిటైర్ అయిన తరువాత.. ఎంటెక్ చేశాక.. గేట్ పరీక్షలోని జియోమోటిక్స్ ఇంజనీరింగ్ పేపర్ లో 140వ ర్యాంక్ సాధించారు. దీంతో అందరి దృష్టిలో పడ్డారు. ఇద్దరు కుమారులు మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడిపే అవకాశం ఉన్నా సరే.. జీవితంలో ఇంకా చదువుకోవాలి.. ఇంకా ఏదో సాధించాలన్న సంకల్పాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు.
గేట్ సాధించినవాళ్లు.. అప్పటి నుంచి 3 ఏళ్లలోపు ఉన్నత విద్యలో చేరడానికి అవకాశం ఉంటుంది. బాంబే లేదా రూర్కెలాలోని ఐఐటీలో చేరాలని.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరాలని సత్యనారాయణ రెడ్డి కోరిక. ఏదేమైనా ఆయన ఆశయం నెరవేరాలని కోరుకుందాం.