Houthis Vs Israel : అమెరికా యుద్ధనౌక, ఇజ్రాయెల్ నౌకలపై హౌతీల ఎటాక్
Houthis Vs Israel : యెమన్ దేశంలోని హౌతీ మిలిటెంట్లు మరోసారి ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు.
- By Pasha Published Date - 09:43 AM, Mon - 4 December 23

Houthis Vs Israel : యెమన్ దేశంలోని హౌతీ మిలిటెంట్లు మరోసారి ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న రెండు ఇజ్రాయెలీ నౌకలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేశారు. యూనిటీ ఎక్స్‌ప్లోరర్, నంబర్ నైన్ అనే పేర్లు కలిగిన రెండు నౌకలపై దాడి చేశామని హౌతీ మిలిటెంట్లు ప్రకటించారు. తాము చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా ఎర్రసముద్రం మీదుగా వెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ దాడి చేశామని వెల్లడించారు. ఈమేరకు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఓడపై హౌతీ మిలిటెంట్లు రెండు డ్రోన్లతో దాడి చేసిన విషయాన్ని బ్రిటన్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే ధ్రువీకరించింది. యెమెన్ సముద్ర తీరానికి 101 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్న మరో ఓడపైనా హౌతీ మిలిటెంట్లు దాడి చేశారని పేర్కొంది. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధనౌక USS కార్నీతో పాటు అనేక వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సైతం వెల్లడించింది.
Also Read: Volcano Eruption : పేలిన అగ్నిపర్వతం.. 11 మంది సజీవ దహనం
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్‌ను ఆపాలని హౌతీ మిలిటెంట్లు డిమాండ్ చేస్తున్నారు. పాలస్తీనా పౌరుల ప్రాణాలను ఇజ్రాయెల్ తీస్తున్నంత కాలం.. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను వేటాడటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈక్రమంలోనే వరుసగా ఇజ్రాయెలీ నౌకలను హౌతీలు లక్ష్యంగా(Houthis Vs Israel) చేసుకుంటున్నారు.