Putin on More Kids: రష్యన్ తల్లులకు పుతిన్ క్రేజీ ఆఫర్
ఒకరు, ఇద్దరు కాదు.. 10మంది పిల్లలను కనమంటున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. 10మందిని కంటే పోషించేది ఎవరు అంటారా..?
- By Naresh Kumar Published Date - 07:20 PM, Thu - 18 August 22

ఒకరు, ఇద్దరు కాదు.. 10మంది పిల్లలను కనమంటున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. 10మందిని కంటే పోషించేది ఎవరు అంటారా..? దానికి ఓ లెక్కుంది. ఏంటా లెక్క..? రష్యన్ తల్లులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏంటి..?
ఓవైపు కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ.. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం..మొత్తంగా రష్యా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. గత కొంతకాలంగా అక్కడ జనాభా గణనీయంగా తగ్గుతోంది. విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశమైన రష్యా ప్రస్తుత జనాభా జస్ట్ 14కోట్లు. ఇది కూడా చాలా వేగంగా తగ్గుతోంది. అందుకే జనాభా పెరుగుదలపై అధ్యక్షుడు పుతిన్ ఫోకస్ పెట్టారు . పెద్దసంఖ్యలో పిల్లలను కనండి.. నజరానా పొందండి అంటోంది పుతిన్ ప్రభుత్వం.
10 అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని కనే మహిళలకు నగదు బహుమతి అందించనుంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మదర్ హీరోయిన్ అవార్డు ప్రకటించారు . 10 మంది అంతకంటే ఎక్కువ పిల్లలను కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ అంటే భారత కరెన్సీలో దాదాపు 13లక్షల రూపాయలు నజరానాగా ఇవ్వనున్నారు. 10వ బిడ్డ తొలి పుట్టిన రోజున ఈ క్యాష్‌ప్రైజ్ చెల్లిస్తుంది పుతిన్ సర్కార్. అయితే, అప్పటికి మిగతా 9 మంది పిల్లలు తప్పనిసరిగా జీవించి ఉండాలి. మదర్ హీరోయిన్ అవార్డ్ రష్యాలో కొత్తేమీ కాదు. 1944లో అప్పటి సోవియట్ ప్రీమియర్ జోసెఫ్ స్టాలిన్ దీనిని ప్రవేశపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జనాభా సంఖ్య దారుణంగా పడిపోవడంతో.. ఆయన ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఇది అప్పట్లో బాగానే వర్కవుట్ అయ్యింది.
దాదాపు 4లక్షలమంది పౌరులు దీనిని అందుకున్నారు. ఇప్పుడు రష్యా జనాభా పెంచడం కోసం .. మళ్లీ స్టాలిన్ రూట్‌లోకే పుతిన్ వెళ్లారు . కుటుంబం ఎంత పెద్దగా ఉంటే దేశంపై అంత ఎక్కువ గౌరవం ఉన్నట్టు పుతిన్ అంటున్నారు . అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం మిలియన్ రూబెల్స్ కోసం 10మంది పిల్లల్ని కని, పెంచడం సాధ్యమేనా అనేదే అసలు ప్రశ్న. ఇప్పటి సామాజిక ఆర్థిక స్థితిగతులకు మదర్ హీరోయిన్ స్కీమ్ సక్సెస్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.