Iranian Plot : ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర ? అమెరికా నిఘా వర్గాలకు సమాచారం
ఇటీవలే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ఘటన అమెరికాలో కలకలం క్రియేట్ చేసింది.
- Author : Pasha
Date : 17-07-2024 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
Iranian Plot : ఇటీవలే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ఘటన అమెరికాలో కలకలం క్రియేట్ చేసింది. ఈదాడికి సంబంధించి అమెరికా నిఘావర్గాలకు కీలక సమాచారం ముందే అందిందట. ట్రంప్‌పై దాడి చేయించేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే సమాచారం అమెరికా నిఘా వర్గాలకు చేరిందట. అందువల్లే కొన్ని వారాల క్రితమే ట్రంప్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. అయితే పెన్విల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ట్రంప్‌పై థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపిన వ్యవహారంతో ఇరాన్‌కు(Iranian Plot) సంబంధం లేదని అంటున్నారు. ఈమేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
అయితే ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో భద్రతా లోపాలపై పలువురు ప్రశ్నలు లేవనెత్తు తున్నారు. ఆ టైంలో పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు గట్టి పహారా ఏర్పాట్లు చేయలేదని సీక్రెట్ సర్వీస్ విభాగం అంటోంది. భద్రతా ఏర్పాట్లు ఒకవేళ జరిగి ఉంటే.. 20 ఏళ్ల కుర్రాడు తుపాకీతో ఇంటిపైకప్పు పైకి చేరుకొని ఏ విధంగా కాల్పులు జరిపాడని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వెంటనే తాము ఈవిషయంపై వ్యాఖ్యానించలేమని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ర్యాలీల సమయంలో జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు ట్రంప్‌ను(Donald Trump) తాము అలర్ట్ చేశామని.. తమవంతుగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఇటీవలే దాడి జరిగినప్పుడు ట్రంప్‌ను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది తామేనని ఆంథోనీ గుగ్లీల్మి పేర్కొన్నారు.
ఈ అంశంపై అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ స్పందిస్తూ.. ఇటీవలే ట్రంప్‌పై జరిగిన దాడి ఘటనపై తొందరపాటుతో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏదైనా మాట్లాడితే దానికి తగిన ఆధారాలు ఉండాలన్నారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్‌కు మరో వ్యక్తితో కానీ, సంస్థతో కానీ, దేశంతో కానీ సంబంధం ఉన్నట్లు ప్రస్తుతానికి ఆధారాలేవీ లభించలేదని వాట్సన్ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఇరాన్ కుట్ర ఉందనేందుకు ఆధారాలు లేవన్నారు.