Canada: భారత్ లో ఉగ్రముప్పు ఉంది.. జాగ్రత్తగా ఉండాలంటూ తమ పౌరులకు సూచించిన కెనడా..!!
భారత్ లో ఉన్న తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసింది కెనడా ప్రభుత్వం. పాకిస్తాన్ తో సరిహద్దు ప్రాంతాలను పంచుకునే గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు దూరంగా ఉండాలని సూచించింది.
- By hashtagu Published Date - 01:52 PM, Wed - 28 September 22

భారత్ లో ఉన్న తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసింది కెనడా ప్రభుత్వం. పాకిస్తాన్ తో సరిహద్దు ప్రాంతాలను పంచుకునే గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. భద్రతా కారణాల వల్ల మందుపాతరలు, పేలుళ్లు, ఆయుధాల ఉనికి ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని…పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల లోపు ప్రాంతాలలో ప్రయాణించడం మానుకోవాలంటూ సలహా ఇచ్చింది. కెనడా గవర్నమెంట్ ఆఫ్ కెనడా తన వెబ్ సైట్లో ట్రావెల్ అడ్వైజరీని సెప్టెంబర్ 27న అప్ డేట్ చేసింది. భారత్ అంతటా ఉగ్రవాద దాడుల ముప్పు ఉందంటూ జాగ్రత్తలు పాటించాలని తమ పౌరులకు పిలుపునిచ్చింది.
సెప్టెంబరు 23న కెనడాకు భారత్ సలహా జారీ:
దేశంలో పెరుగుతున్న నేరాలు భారత వ్యతిరేక కార్యకలాపాల మధ్య అప్రమత్తంగా ఉండాలని కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు భారత్ సెప్టెంబర్ 23న సలహా ఇచ్చింది. “కెనడాలో విద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల సంఘటనలు గణనీయంగా పెరిగాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, కెనడాలోని మా హైకమిషన్/కాన్సులేట్ కెనడా అధికారులతో ఈ ఘటనల గురించి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాయి. కెనడాలో భారతీయులపై జరిగిన నేరాలపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కెనడాలో నేరాలు పెరుగుతున్న తరుణంలో భారతీయ విద్యార్థులు, భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ లో ఉగ్రముప్పు ఉందని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ కెనడా ప్రభుత్వం సూచింది.