Trump : ట్రంప్‌పై కాల్పుల కేసులో కీలక ఆధారం.. సోషల్ మీడియాలో ‘క్రూక్స్’ పోస్ట్
గత శనివారం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను విచారిస్తున్న అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కీలక ఆధారాలను సేకరించింది.
- By Pasha Published Date - 03:43 PM, Thu - 18 July 24

Trump : గత శనివారం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను విచారిస్తున్న అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కీలక ఆధారాలను సేకరించింది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్ స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పట్టిన ఎఫ్‌బీఐ అధికారులు కీలక సమాచారాన్ని గుర్తించారు. ట్రంప్‌పై(Trump) కాల్పులు జరపడానికి కొన్నాళ్ల ముందే సోషల్ మీడియాలో క్రూక్స్ వివాదాస్పద పోస్టు చేశాడని నిర్దారించారు. త్వరలోనే అమెరికాలో ఏదో పెద్దది జరగబోతోందని పరోక్షంగా కామెంట్ చేస్తూ అతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈమేరకు అమెరికా సెనేటర్లకు ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు వివరాలను తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join
నిందితుడు క్రూక్స్ ‘స్టీమ్’ అనే గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో గేమ్స్ ఆడేవాడు. ‘జులై 13న నా తొలి అడుగు. అది ఆవిష్కృతమవుతున్నప్పుడు వీక్షించండి’ అని పోస్టులో క్రూక్స్ వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్‌పై క్రూక్స్ కాల్పులు జరిపింది కూడా జులై 13వ తేదీనే కావడం గమనార్హం. ఇక క్రూక్స్ ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌బీఐ టీమ్ శోధించగా.. జులై నెలలో బైడెన్, ట్రంప్‌ల పర్యటనల వివరాలను అతడు సెర్చ్ చేసినట్టుగా ఉంది. బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ తేదీల వివరాలను.. జులై 13న జరిగే ట్రంప్ ర్యాలీ వివరాలను క్రూక్స్ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడని విచారణలో గుర్తించారు. అంటే ట్రంప్‌పై దాడి చేసేందుకు క్రూక్స్ ముందస్తు ప్రణాళికతో ఉన్నాడని స్పష్టమవుతోంది. అయితే ట్రంప్‌పై క్రూక్స్ కాల్పులు జరపడానికి కారణం ఏమిటి ? అతడిని ఈ దాడి చేసేలా ఎవరు ప్రేరేపించారు ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read :Beauty Tips: కీరదోసకాయతో మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా!
ఎఫ్‌బీఐ అధికారులు క్రూక్స్‌కు(Thomas Matthew Crooks) వచ్చిన మెయిల్స్, మెసేజ్‌లను కూడా జల్లెడ పడుతోంది. అతడు ట్రంప్‌పై కాల్పులు జరపడానికి కొన్ని రోజుల ముందు ఏయే యాప్‌ల ద్వారా ఎవరెవరికి కాల్ చేశాడనేది కూడా తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్రూక్స్ వాడిన రెండు ఫోన్లు కూడా ఎఫ్‌బీఐ అధికారులకు దొరికాయి. వాటిని ఇజ్రాయెల్ టెక్నాలజీతో అన్‌లాక్ చేశారు. క్రూక్స్ రెండో ఫోన్‌లో 27 కాంటాక్టులే ఉన్నాయి. ఇక ట్రంప్‌పై క్రూక్స్ దాడి చేయడానికి కాసేపటి ముందే అతడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను కంప్లయింట్ చేయడం గమనార్హం.