Plane Crash : ఇళ్లలోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది మృతి.. 17 మందికి గాయాలు
ఫర్నీచర్ దుకాణంలోకి విమానం(Plane Crash) దూసుకెళ్లింది.
- By Pasha Published Date - 10:39 AM, Mon - 23 December 24

Plane Crash : బ్రెజిల్‌లో విమాన ప్రమాదాలు ఎంతకూ ఆగడం లేదు. విమాన ప్రమాదాలు జరగడం అక్కడ షరా మామూలుగా మారింది. తాజాగా ఓ విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోయింది. గ్రామడో పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో విమానంలోని 10 మంది చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చనిపోయిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్త లూయిజ్ క్లౌడియో సాల్‌గ్యూరో గాలెజీ ఉన్నారని తెలిసింది. విమానం ఢీకొట్టిన ఇళ్లలోని దాదాపు 17 మందికి గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ విమానం(Plane Crash) మొదట ఓ పెద్ద భవనాన్ని ఢీకొట్టింది. ఆ వెంటనే పక్కనున్న ఇతర ఇళ్లపైకి దూసుకెళ్లింది. అనంతరం ఒక ఫర్నీచర్ దుకాణంలోకి విమానం(Plane Crash) దూసుకెళ్లింది. క్రిస్మస్ వేడుకల కోసం గ్రామడో పట్టణం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటనతో స్థానిక ప్రజలు షాక్‌కు గురయ్యారు.
Also Read :Encounter : ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
ఈ ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ట్విన్ ఇంజిన్ విమానం ఒకటి కూలిపోయింది. విన్ హెడో నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏకంగా 62 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేదు. గత 17 ఏళ్లలో బ్రెజిల్‌లో చోటుచేసుకున్న అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదం అదే. ఈ ఏడాది డిసెంబరు 21న బ్రెజిల్‌లోని మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 41 మంది చనిపోయారు. ఎంతోమందికి గాయాలయ్యాయి.
Also Read :Bank Loans Evasion : బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన తెలుగు రాష్ట్రాల కంపెనీలివే
1968 సంవత్సరం ఫిబ్రవరి 7న ఏమైందంటే..
1968 సంవత్సరం ఫిబ్రవరి 7న చండీగఢ్ నుంచి లేహ్‌కు బయలుదేరిన భారత వాయుసేనకు చెందిన రవాణా విమానం ప్రమాదానికి గురైంది. అది హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌లో కూలిపోయింది. ఆ విమానంలో 102 మంది ఉన్నారు. అయితే ఆ విమాన శకలాలు కూడా ఇప్పటిదాకా లభించలేదు. ఐదున్నర దశాబ్దాల కింద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఇటీవలే కీలక పురోగతి చోటుచేసుకుంది. ఆ విమాన ప్రయాణికుల్లో నలుగురి అవశేషాలను గుర్తించామని భారత సైన్యం తాజాగా ప్రకటించింది.