North Korea : మరోసారి మిస్సైళ్లు పరీక్షించిన కిమ్.. దక్షిణ కొరియా, జపాన్‌లలో హైఅలర్ట్
ఒకటికి మించి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా(North Korea) వరుసపెట్టి ప్రయోగించడాన్ని తాము గుర్తించామని దక్షిణ కొరియా తెలిపింది.
- By Pasha Published Date - 10:01 AM, Thu - 12 September 24

North Korea : ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. షార్ట్ రేంజ్ కలిగిన బాలిస్టిక్ మిస్సైళ్లను ఇవాళ తెల్లవారుజామున వరుస పెట్టి పరీక్షించింది. ఆ మిస్సైళ్లు వెళ్లి కొరియా ద్వీపకల్ప సముద్ర జలాల్లో పడినట్లు జపాన్ కోస్ట్ గార్డ్ దళం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా తూర్పు తీర భాగంలో ఆ మిస్సైళ్లను పరీక్షించారని వెల్లడించింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో తమ తీర ప్రాంత భద్రతా బలగాలను అలర్ట్ చేశామని జపాన్ రక్షణ శాఖ తెలిపింది. ఒకటికి మించి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా(North Korea) వరుసపెట్టి పరీక్షించడాన్ని తాము గుర్తించామని దక్షిణ కొరియా తెలిపింది. తాము ఈ సమాచారాన్ని అమెరికా, జపాన్‌లకు చేరవేశామని పేర్కొంది. ఉత్తర కొరియా సైనిక కార్యకలాపాలపై పకడ్బందీ నిఘా పెట్టామని దక్షిణ కొరియా సైనిక వర్గాలు చెప్పాయి.
Also Read :Hamas Vs Israel : కాల్పుల విరమణకు సిద్ధమన్న హమాస్.. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్
ఇటీవలే సెప్టెంబరు 9న ఉత్తర కొరియా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా దేశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రసంగిస్తూ.. మరిన్ని అణ్వాయుధాలను పెంచుకోవడంపై తమ దేశం ఫోకస్ చేస్తుందని వెల్లడించారు. దక్షిణ కొరియా, జపాన్, అమెరికాల కూటమిని తిప్పికొట్టేందుకు తాము సమాయత్తం అవుతామన్నారు. ఆ మూడు దేశాలు సరిహద్దుల్లో చేస్తున్న ఆగడాల వల్లే తాము అణ్వాయుధ శక్తిని, క్షిపణి శక్తిని, సూసైడ్ డ్రోన్లను పెంచుకోవాల్సి వస్తోందని కిమ్ వివరించారు. 2016 సంవత్సరంలో సెప్టెంబరు 9న ఉత్తర కొరియా ఐదో అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. 2017లో సెప్టెంబరు 3న ఆరో అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. ఉత్తర సైనిక శక్తి నిర్మాణానికి రహస్యంగా రష్యా, చైనా, ఇరాన్ దేశాల నుంచి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మెటీరియల్‌ను సముద్ర మార్గంలో ఉత్తర కొరియాకు ఆ మూడు దేశాలు సప్లై చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్, రష్యా, ఉత్తర కొరియా స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి.